logo

header-ad
header-ad

బోరు బావిలో పడిపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా ?

బోరు బావిలో పడిపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా... ఊపిరి పోకముందే ఆ పసిమొగ్గల్ని బయటకు తీసుకొచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదా? బోరుబావి ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్స్‌ ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి? కొత్త టెక్నాలజీలేమైనా వచ్చాయా? అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి.  చిన్నారి ప్రాణాలను చిదిమేసేందుకు.. బోరు బావులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. బోరు బావిలో పడ్డారంటే.. ఆశలు వదులుకోవాల్సిందే అన్నంత పరిస్థితి. ఎంత లోతులో పడ్డారో.. ఎక్కడున్నారో... అసలు బతికున్నారో.. లేదో తెలుసుకోలేని పరిస్థితి. భూ ఉపరితలం మీదయితే ఏమైనా చేయగలం. కానీ, భూ అంతర్భాగంలో... అదీ ఒక అడుగు సందులో... వందల ఫీట్ల లోతున్న బోరుబావుల్లో పరిస్థితిని గమనించడం ఏ స్కానర్ వల్ల అవుతుంది. అందుకే చాలా రెస్క్యూ ఆపరేషన్స్‌ ఫలితానివ్వని పరిస్థితి.

మనదేశంలో సాధారణంగా బోరుబావిలో ఎవరు పడినా.. ముందుగా గుంతలోకి ఆక్సిజన్‌ పైపులను వదలడం, ఆ తర్వాత ఆ గుంతకు సమాంతరంగా దాని చుట్టూ పెద్దగా మరిన్ని గుంతలు తవ్వడం దాని పక్క నుండి చిన్నారులు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది రెస్క్యూ టీమ్‌. అయితే ఈ ప్రయత్నంలో విజయవంతమైంది మాత్రం చాలా తక్కువ సార్లే. అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ అదే కాబట్టి.. రెస్క్యూ టీమ్‌ కూడా దాని మీదే ఆధారపడుతోంది. అయితే, ఇతర దేశాల్లో జరిగే రెస్క్యూ ఆపరేషన్స్‌ మాత్రం కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. చైనాలో ఆ మధ్య 300 అడుగుల లోతులో చిక్కుకుపోయిన బుడతణ్ని విజయవంతంగా బయటకు తీయగలిగారు. బోరు బావిలో పడిన వారిని నిమిషాల వ్యవధిలో బయటకు తీసిన ఘటనలు చైనాలో ఉన్నాయి. అందుకోసం వారు అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు. 

బోరుబావిలో పడిన చిన్నారి.. కచ్చితంగా ఎంత లోతులో ఉన్నాడో, అతను ఇరుక్కుపోయిన స్పాట్ ఏదో.. స్పష్టంగా తెలుసుకునే టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే చైనాలాంటి దేశాల్లో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు నిమిషాల్లో ముగుస్తున్నాయి. బాధితుల ప్రాణాలు కాపాడుతున్నాయి. మనదేశంలోనూ ఇలాంటి అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో .. రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించవచ్చని పలువురు సూచిస్తున్నారు. అయితే అవేవీ ఇంకా కార్యరూపం రాల్చలేదు. బోరు బావిలో పడిన వెంటనే పలు టెక్నిక్స్‌ ద్వారా ఈజీగా ప్రాణాలు కాపాడవచ్చని .. వీటిని రూపొందిస్తున్న ప్రైవేటు నిపుణులు చెబుతున్నారు. వీటికి సంబంధించిన విధివిధానాలను సైతం యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్‌ చేస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. అయితే వీటికి శాస్త్రీయత ఏమీ లేదు. ఏదేమైనా, ఇలాంటి ప్రమాదాల నుంచి పసివాళ్లను కాపాడేందుకు.. దేశీయంగా మరింత టెక్నాలజీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

Source: https://www.ntvtelugu.com/post/will-technology-helps-rescue-from-bore-well

Leave Your Comment