తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి (టీటీడీ)సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశానంతరం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలకు భక్తులు ఎంతో భక్తిభావంతో వస్తుంటారని.. వారిలో మరింత ఆధ్యాత్మికభావన పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక తిరుమల తరహాలోనే తిరుపతిలో కూడా దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ను వీలైనంత వరకు నిషేధించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు.. సంక్రాంతి తర్వాత తిరుమలలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. స్వామివారి లడ్డూ ప్రసాదం అందించేందుకు కూడా.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం, స్విమ్స్‌ను టీటీడీ పరిధిలోకి తీసుకోవడం సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులకు, భక్తులకు ధన్యవాదాలు చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలివే:
* తిరుమలలో మంచినీటి కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం
* తిరుమల తరహాలో తిరుపతిలోనూ పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం
* స్విమ్స్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం
* కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యూలైజ్ చేయడం
* సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం
* గరుడ వారిధి రీ డిజైనింగ్ చేసి, రీ టెండర్ల ద్వారా టీటీడీనే నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
* 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం

Source: https://tv9telugu.com/ttd-to-seek-ap-government-to-implement-total-prohibition-in-tirupati-on-par-with-tirumala-152591.html