logo

header-ad
header-ad

‘ఈ రాత్రికే హైదరాబాద్‌ వచ్చేయండి’

హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 35వ రోజు కొనసాగుతోంది. తమ ఆందోళనల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు శవివారం(నవంబర్‌ 9) రోజున చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ చేపట్టనున్న చలో ట్యాంక్‌బండ్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు అక్రమ అరెస్ట్‌లను జేఏసీ నేతలు ఖండించారు.

రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకోవాలి : అశ్వత్థామరెడ్డి

కార్మికుల అక్రమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఇళ్లలో దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళ కార్మికులను కూడా అరెస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని.. పోలీసులు దమనకాండ ఆపాలని అన్నారు. అరెస్ట్‌ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ రోజు రాత్రి వరకు కార్మికులందరూ హైదరాబాద్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ముగ్దుం భవన్‌లో అఖిలపక్ష సమావేశం..

సమ్మె, భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందకు ఓయూ జేఏసీతో ఈయూ కార్యాలయంలో జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని ఆర్టీసీ జేఏసీ రద్దు చేసుకుంది. కార్మికుల అక్రమ అరెస్ట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముగ్దుం భవన్‌లో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్టులపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. 

Source: https://www.sakshi.com/news/telangana/tsrtc-strike-jac-preparations-chalo-tank-bund-1238508

Leave Your Comment