logo

header-ad
header-ad

ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులు ఇంకా సమ్మెలోనే కొనసాగుతున్నారు. దీంతో ఇవాళ కోర్టులో విచారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని ఆర్థిక శాఖ తెలిపింది. మరోవైపు స్వయంగా తమ ముందుకు రావాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణకు సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరుకానున్నారు.

మరోవైపు 5వేల బస్సులకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది. ఇక 5వేల ఆర్టీసీ సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 5 వేల వంద ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గడువులోపు కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా రూట్లను కూడా ప్రైవేటుపరం చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన అంశాలపైనే కేసీఆర్‌ ప్రధానంగా అధికారులతో నిన్న చర్చలు జరిపారు.

కొత్తగా ఎన్నిరూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించవచ్చనే అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. సమ్మె కొనసాగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనేదానిపైనా అధికారుల దగ్గర వివరణ తీసుకున్నారు సీఎం కేసీఆర్.  మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం సమ్మెను యధాతధంగా కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలకు భయపడాల్సిన అవసరం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీ స్వరూపాన్ని మార్చడం సాధ్యంకాదన్నారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయిన జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇక ఈ నెల 9న చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి ఆర్టీసీ సంఘాలు.

Source: https://www.ntvtelugu.com/post/telangana-high-court-on-tsrtc-privatisation

Leave Your Comment