నయన తార...తమిళ సూపర్ స్టార్. చాలా కాలం నుంచి సినిమా ఇండిస్టీలో ఉన్నా రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. మహిళా ప్రాధాన్య చిత్రాలు చేసినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లకొడుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న కథానాయికలు కూడా ఈమెను ఓవర్‌టాక్ చేయలేకపోతున్నారంటే తన నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అది నటనలోనే కాదు పారితోషికంలోనూ దక్షిణాదిలో అందరి కంటే ఎక్కువే. ఇప్పుడు ఈమె ఓ సినిమా చేసేందుకు తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? రూ. 5కోట్లు. ఇంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కడా చెక్కు చెదరలేదు. 'బాహుబలి' నిర్మాణం సమయంలో అనుష్క శెట్టి రూ.4కోట్లు డిమాండ్ చేయడంపై పెద్ద చర్చ జరిగింది. ఆ సినిమా కోసం ఆమె ఏకంగా నాలుగేళ్ల పాటు తన కాల్‌షీట్స్‌ను కేటాయించింది. కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ సరిపోతుందని అంతా అనుకున్నారు. 'బాహుబలి' విజయం సాధించిన తర్వాత మాత్రం అందులో వచ్చిన లాభాలను కూడా ఈమె పొందారనుకోండి. కానీ 6 నెలలు లేదా ఏడాది పాటు ఓ సినిమాకి పని చేసే నయన తార మాత్రం ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటుందని కోలీవుడ్ చెబుతుంది. ప్రస్తుతం ఈమె అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పుడు అగ్ర నటులు తమిళంలో విజరు హీరోగా చేస్తున్న ' బిగిల్'లోనూ, తెలుగులో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'సైరా'లోనూ కథానాయికగా చేస్తోంది నయన.

Source: http://www.prajasakti.com/Article/CinemaVaarthalu/2167272