నందమూరి బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ల ఎంపిక చాలా క్లిష్టంగా మారింది. దాదాపుగా పెద్ద హీరోయిన్లు అందరూ ఆయనతో ఆడిపాడిన వాళ్ళే. కొత్తదనం కావాలంటే తప్పకుండా ఇంతకుమునుపు బాలయ్యతో చేయని నటినే తీసుకురావాలి. కానీ తెలుగులో దాదాపు అలాంటి వాళ్ళెవరూ లేరు. అందుకే బోయపాటి శ్రీనుకు కొత్త సినిమా కోసం హీరోయిన్లను సెలెక్ట్ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఆలస్యమైనా కూడ ఆయన మంచి సెలక్షన్ చేసుకున్నారు.
ఇప్పటికే మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ ఒక కథానాయిక పాత్ర కోసం ఫైనల్ కాబడింది. రెండవ కథానాయకిగా తెలుగు నటి పూర్ణను ఎంచుకున్నారని టాక్. పూర్ణ ఇప్పటివరకు బాలయ్యతో నటించలేదు. నిజం చెప్పాలంటే స్టార్ హీరోతో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. మంచి నటి అనే పేరున్నా, కొన్ని చెప్పుకోదగిన హిట్లున్నా ఇంతవరకూ ఆమెకు సాలిడ్ ప్రాజెక్ట్ పడలేదు. ఆ లోటు ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటిల చిత్రంతో తీరిపోనుంది. గతంలో బోయపాటితో బాలయ్య ‘సింహ, లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తీసుకొచ్చారు. అందుకే ఈ కాంబినేషన్ మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.