logo

header-ad
header-ad

2020.. సైన్స్‌లో ఎన్నో అద్భుతాలు

ఓవైపు ప్ర‌కృతి మ‌నిషికి స‌వాళ్లు విసురుతూనే ఉంది. మ‌రోవైపు మ‌నిషి మాత్రం వాటిని అధిగ‌మిస్తూ కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. 2020 చాలా మందికి క‌రోనా నామ సంవ‌త్స‌రంగా మిగిలిపోతుంది. కానీ ఈ ఏడాది సైన్స్ నామ సంవ‌త్స‌రం కూడా. ఈ ఏడాది సైన్స్‌లో ఎన్నో పరిశోధ‌న‌లు, ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగు చూశాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైరాల‌జిస్ట్‌లు, ఇమ్యునాల‌జిస్ట్‌లు, బ‌యాల‌జిస్ట్‌లు, ఎపిడ‌మాల‌జిస్ట్‌లు మెరుపు వేగంతో ప‌ని చేసి వ్యాక్సిన్‌ల‌ను తీసుకురాగ‌లిగారు. ఇదే కాకుండా 2020లో జ‌రిగిన సైన్స్ అద్భుతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చంద్రుడిపై నీళ్లు

ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో తొలిసారి చంద్రుడిపై నీళ్లు ఉన్న‌ట్లు నాసా నిర్ధారించింది. చంద్రుడిపై సూర్య‌ర‌శ్మి ప‌డే భాగంలో నీరు ఉన్న‌ట్లు నాసా తెలిపింది. అయితే మొత్తం చంద్రుడి ఉప‌రిత‌లంపై ఈ నీరు విస్త‌రించి ఉండ‌వ‌చ్చ‌ని కూడా నాసా అంచ‌నా వేసింది.

మ‌నుషుల్లో కొత్త గ్రంథులు

ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో నెద‌ర్లాండ్స్ క్యాన్స‌న్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప‌రిశోధ‌కులు మ‌నుషుల్లో కొత్త గ్రంథులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు లాలాజ‌ల గ్రంథులు.. నాసికా కుహ‌రం, గొంతు మ‌ధ్య భాగంలో గుర్తించిన‌ట్లు వాళ్లు చెప్పారు. వీటికి ట్యూబ‌రియ‌ల్ గ్లాండ్స్‌గా పేరు పెట్టారు.

వీన‌స్‌పై సూక్ష్మ‌జీవులు?

ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో అంత‌ర్జాతీయ శాస్త్ర‌వేత్త‌ల బృందం ఒక‌టి శుక్ర గ్ర‌హం (వీన‌స్‌)పై ఫాస్ఫీన్ వాయువును గుర్తించింది. భూమిపై ఆక్సిజ‌న్ లేని ప్రాంతం (అనేరోబిక్‌)లో జీవించే సూక్ష్మ‌జీవులు ఈ ఫాస్ఫీన్ గ్యాస్‌ను విడుద‌ల చేస్తాయి. ఆ లెక్క‌న అది జీవం ఆన‌వాళ్ల‌ను సూచిస్తోంద‌ని ఈ ప‌రిశోధ‌న‌లో పాలు పంచుకున్న‌ మ‌సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఆస్ట్రోఫిజిసిస్ట్ క్లారా సౌసా చెప్పారు. 

చంద్రుడు, ఆస్ట‌రాయిడ్ నుంచి న‌మూనాలు

ఈ ఏడాది చంద్రుడితోపాటు ఓ ఆస్ట‌రాయిడ్ మ‌ట్టి న‌మూనాలు భూమిపైకి వ‌చ్చాయి. చైనాకు చెందిన చాంగె-5 మిష‌న్ 1731 గ్రాముల చంద్రుడి మ‌ట్టి న‌మూనాల‌ను తీసుకొచ్చింది. అమెరికా, సోవియ‌ట్ యూనియ‌న్ తర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇక జ‌పాన్‌కు చెందిన హ‌య‌బుసా 2 ఒక ఆస్ట‌రాయిడ్ నుంచి న‌మూనాల‌ను తీసుకొచ్చింది. 2014లో వెళ్లిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌.. నాలుగేళ్లు ప్ర‌యాణించి ర్యుగు అనే ఆ ఆస్ట‌రాయిడ్‌పైకి చేరింది. అక్క‌డి నుంచి న‌మూనాల‌ను సేక‌రించి గ‌తేడాది న‌వంబ‌ర్‌లో భూమి వైపు తిరుగు ప్ర‌యాణ‌మైంది. 

మ‌ళ్లీ మార్స్‌పైకి నాసా రోవ‌ర్‌

ప‌ర్సీవ‌రెన్స్ అనే రోవ‌ర్‌ను ఈ ఏడాది జులై 30న మార్స్‌పైకి ప్ర‌యోగించింది నాసా. ఇది తొలిసారి భూమిపైకి మార్స్ న‌మూనాల‌ను తీసుకురానుంది. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే 2021, ఫిబ్ర‌వ‌రి 18న ఈ రోవ‌ర్ మార్స్‌పైకి దిగ‌నుంది.

Source: https://www.ntnews.com/science-technology/many-science-innovations-and-launches-to-outer-space-took-place-in-2020-116769

Leave Your Comment