బాసిల్: కోట్లాది భారతీయుల గుండె గొంతుకను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ధ్వనింపజేసిన సింధూరనాదమిది... పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది... దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన క్షణమిది. వయసు కేవలం 24 ఏళ్లు... కానీ పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. వరల్డ్ చాంపియన్ షిప్ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్ర్కమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. స్వర్ణం ముచ్చటను తీర్చుకుంది.
ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకున్నారు సింధు. గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం.. ఈసారి మాత్రం పసిడి సాధించే వరకూ వదల్లేదు. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ ఐదో ర్యాంకర్ పీవీ సింధు.. ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచి జగజ్గేతగా అవతరించారు. రెండు గేమ్స్‌లో అలవోకగా సాగిన పోరులో సింధు 21-7, 21-7 తేడాతో గెలిచి చాంపియన్ కలను నెరవేర్చుకున్నారు. తొలి నుంచి ఒకుహరా అంచనాలకు అందకుండా సింధు ఏకపక్షంగా ఆటను కొనసాగించారు. సుదీర్ఘమైన ర్యాలీలు, అద్భుతమైన స్మాష్‌లతో పాటు అంతకుమించి సొగసైన రిటర్న్ షాట్లతో సింధు అలరించారు.
లెక్క సరిపోయింది..
2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఒకుహారాతో జరిగిన ఫైనల్ పోరులో ఓటమి పాలైన సింధు అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ గెలుపుతో ఒకుహారా లెక్కను సరిచేశారు. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేశారు. ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన సింధు.. ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు.ఎలాగైన స్వర్ణం సాధించాలనే కసితో సింధు ఆట తీరు సాగింది. మరొకవైపు ఫైనల్ ఫోబియాకు చెక్ పెట్టాలనే ఏకైక లక్ష్యమే ఆమెకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.

Sports
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు
August 25, 2019
Source: https://www.ntnews.com/sports-news-telugu/pv-sindhu-beats-nozomi-okuhara-21-7-21-7-to-win-gold-1-1-10604050.html