సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటు పీఎస్‌ఎల్‌వీ సీ-48 సేవలు అందించనుంది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు.
కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్‌యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది.
భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్‌ఎల్‌వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్‌ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.

Source: https://www.sakshi.com/news/national/pslv-c48-successfully-injects-primary-satellite-risat-2br1-says-isro-1247066