logo

header-ad
header-ad

3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం

  • అయిదేళ్లలో  26 బ్యాంకుల్లో 3400 బ్యాంకు శాఖలు మూత 
  • ఇటీవల ప్రకటించిన మెగా మెర్జర్‌ మరో 7 వేల శాఖలపై ప్రభావం

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం  చేయడం జరిగింది. 5  ఆర్థిక సంవత్సరాల్లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల 3,400 కి పైగా శాఖలు మూసివేత  లేదా విలీనం అయ్యాయని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా  వెల్లడైంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీముచ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ప్రశ్నకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75 శాతం బ్యాంకు శాఖలు ఎస్‌బీఐకి చెందినవే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం ఎస్‌బీఐతోనే ఆరంభమైన విషయం తెలిసిందే. అనుబంధ బ్యాంకులతోపాటు భారత్‌ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి. ఎస్‌బీఐకి సంబంధించి మొత్తం 2,568 శాఖలను గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విలీనం లేదా మూసివేతకు గురైనాయి. కాగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన దేశంలోని పది ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల్లో నాలుగు పెద్ద బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ బ్యాంకుల కనీసం 7,000 శాఖలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని  పేర్కొన్నారు. 

Source: https://www.sakshi.com/news/business/over-3400-branches-26-public-sector-banks-closed-or-merged-last-5-years-1237479

Leave Your Comment