logo

header-ad
header-ad

మళ్లీ కొండెక్కిన ఉల్లి ధర.. కోయకుండానే కన్నీరు..!

మరోసారి ఉల్లి ధరలు సామాన్యుడిని కన్నీరు పెట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉల్లి ధర రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది. ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో కిలో రూ.80 దాటి సామాన్యుడి నడ్డివిరిచిన ఉల్లి ధరలు.. మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద హోల్‌ సేల్‌ ఉల్లి మార్కెట్ లాసాల్‌గావ్‌లో కిలో రూ.55.50 పలుకుతోంది. అత్యధికంగా ఉల్లి సాగుచేసే నాసిక్, అహ్మద్నగర్, పుణెల్లో రెండు వారాల్లో భారీ వర్షాలు కురిసి పంటకు నష్టం వాటిళ్లింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇటు, హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80గా ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో నాణ్యమైన మహారాష్ట్ర గ్రేడ్-1 ఉల్లి హోల్‌సేల్‌లో కిలో రూ.60, రెండో రకం కిలో రూ.50, మూడో రకం రూ.40 పలికింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఉల్లి గ్రేడ్-1 రూ.50, గ్రేడ్-2 రూ.40లకు చేరింది. రిటెయిల్ మార్కెట్లో ఇది రూ.70 నుంచి 80గా ఉంది. అటు ఆంధప్రదేశ్‌లోనూ ఉల్లి ధరలు రూ.50 నుంచి రూ.70 మధ్య పలుకుతున్నాయి. దీంతో ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇరాన్, ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటామని ఢిల్లీలోని వినియోగదారుల వ్యవహరాల విభాగం తెలిపింది. ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకడంతో కేంద్రం వాటి ఎగుమతిపై సెప్టెంబరులో నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉల్లి ఎగుమతి చేయరాదంటూ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. 

Source: https://www.ntvtelugu.com/post/onion-prices-may-have-peaked-at-rs-100-a-kg

Leave Your Comment