ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీపై జాతీయ మీడియా ఒకే మాట చెబుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలోకి చేరే విషయమై ఈ భేటీ జరిగినట్టుగా, ఈ సమావేశం ప్రధాన అజెండా అదే అని నేషనల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఈ సమావేశంలో చర్చ ఒక కొలిక్కి రాలేదని కూడా ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఎన్డీయేలోకి చేరడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మోడీ నుంచి ఆహ్వానం అందిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన షరతును ప్రస్తావించినట్టుగా ఆ కథనంలో ఆ పత్రిక పేర్కొంది. ఏపీకి ప్రత్యేకహోదాను వైఎస్ జగన్ ప్రస్తావించారని, రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ఇస్తే ఎన్డీయేలోకి చేరడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోడీ వద్ద జగన్ స్పష్టం చేశారని టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం జగన్ కు ఎన్డీయేలో చేరితే పలు అంశాలు చక్కబడతాయి. ప్రత్యేకించి ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు బీజేపీ వైపుకు తలుపులూ మూసుకుపోతాయి. జగన్ మీద అవాకులు చవాకులు పేలే పవన్ కల్యాణ్ కు అది షాకే అవుతుంది. అయినా.. ఇలాంటి అవకాశాల కోసం జగన్ ఆలోచించడం లేదని స్పష్టం అవుతోంది.
రాజకీయంగా లబ్ధి కలిగే అవకాశం ఉన్నా.. ప్రత్యేకహోదా డిమాండ్ ను ఇలా నెగ్గించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని జాతీయ మీడియా కథనాల ద్వారా స్పష్టం అవుతూ ఉంది. చంద్రబాబునో, పవన్ కల్యాణ్ నో దృష్టి లో ఉంచుకుని జగన్ రాజకీయం సాగదని, రాష్ట్ర ప్రయోజనాలనే జగన్ ప్రాథమిక ప్రాధాన్యతలుగా తీసుకుంటున్నారని స్పష్టం అవుతూ ఉంది.