logo

header-ad
header-ad

వినాయకుని విశిష్ట ఆలయాలు

వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడని అంటారు. ప్రమథగణాలకు అధిపతి గనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో అలరారుతుంటాడు గనుక లంబోదరుడని అంటారు. మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషికవాహనుడని అంటారు. ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గజాననుడని, ఒక దంతం విరిగి ఉండటం వల్ల ఏకదంతుడని అంటారు.  వినాయకుడు ఎందరికో ఇష్టదైవం. దేశదేశాల్లో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి, ఆరాధకులూ ఉన్నారు.

సనాతన సంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమైన మతం కూడా ఉంది. వినాయకుడే ప్రధాన దైవంగా ఆరాధించే మతాన్ని గాణపత్యం అంటారు. వినాయకుడికి ఎన్నో నామాలు ఉన్నట్లే, ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. వినాయకుడి కథ, వినాయక చవితి పూజావిధానం దాదాపు అందరికీ తెలిసినదే. వినాయకుడికి గల అరుదైన ఆలయాల గురించి తక్కువ మందికి తెలుసు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి గల కొన్ని అరుదైన ఆలయాల విశేషాలు మీ కోసం...

వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం, ఆంధ్రప్రదేశ్‌
శ్రీవరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. కాణిపాకం వినాయక ఆలయం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. కాణి అంటే పావుఎకరా మాగాణి భూమి అనే అర్థం ఉంది. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. కాణిపాకం స్థలపురాణం ప్రకారం వెనుకటి కాలంలో ఇక్కడ ముగ్గరు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గరిలో ఒకరు గుడ్డి, ఒకరు మూగ, ఒకరు చెవిటి. అవిటితనాలతో బాధపడుతూనే ఆ అన్నదమ్ములు ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవితం గడిపేవారు. వారి పొలంలో ఒక బావి ఉండేది. బావిలోని నీరు ఏతంతో తోడి పొలానికి నీరు పట్టేవారు. ఒకసారి బావిలో నీరు పూర్తిగా ఇంకిపోయింది.

మరింత లోతుగా తవ్వితే నీరు పడుతుందేమోననే ఆశతో అన్న దమ్ములు బావిలోకి దిగి తవ్వుతుండగా, గునపానికి గట్టిగా రాతిలాంటిదేదో తగిలింది. గునపం బయటకు తీసి చూడగా, దానికి నెత్తురు అంటుకుని ఉంది. కొద్దిసేపట్లోనే బావిలోని నీరు నెత్తుటి రంగులోకి మారింది. ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం కూడా మాయమైంది. బావిని మరింత లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం పూర్తికాకుండానే బావిలోని నీటి నుంచి వినాయకుడి శిలావిగ్రహం బయటపడింది. ఈ మహిమ చూసిన జనాలు కొబ్బరినీళ్లతో విగ్రహానికి అభిషేకాలు చేశారు. అలా అభిషేకించిన కొబ్బరినీరు ఎకరంపావు దూరం కాలువలా ప్రవహించింది. అందువల్ల దీనిని తమిళంలో ‘కాణిపరకం’ అని పిలిచేవారు. రానురాను ఇది కాణిపాకంగా మారింది.

ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం నేటికీ బావిలోనే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తమకు ఇష్టమైన పదార్థాన్ని స్వామివారికి వదిలిపెడితే కోరికలు తీరుతాయని నమ్మకం. అలాగే, కాణిపాకం వినాయకుడు సత్యప్రమాణాల వినాయకుడిగా కూడా ప్రసిద్ధుడు. ఇక్కడ వినాయకుని ఎదుట ప్రమాణం చేసిన వారు సత్యమే పలకాలని, అసత్యం పలికిన వారికి అనర్థాలు తప్పవని కూడా భక్తులు నమ్ముతారు. చోళుల కాలంలో పదకొండో శతాబ్దిలో ఇక్కడ వినాయకునికి ఆలయం నిర్మించారు. పదమూడో శతాబ్దిలో కులోత్తుంగ చోళుడు ఇప్పుడు ఉన్న రీతిలో ఆలయాన్ని మరింత విశాలంగా నిర్మించాడు.

మధుర మహాగణపతి, కేరళ
కేరళలోని మధుర మహాగణపతి ఆలయం ఒకప్పుడు శివాలయం. పరమశివుడు మదరనాథేశ్వరునిగా ఇక్కడ వెలశాడు. అప్పట్లో ఇది తుళునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభువుగా వెలసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారు. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరిట ఇక్కడి శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. ఒకనాడు స్థానిక తుళు బాలుడు ఒకడు ఆలయంలో ఆడుకుంటూ, గర్భగుడిలోని దక్షిణ గోడపై వినాయకుడి బొమ్మ గీశాడు. గోడలపై ఆ బాలుడు గీసిన వినాయకుడి బొమ్మ పరిమాణం నానాటికీ పెరగసాగింది. చూస్తుండగానే కొద్దిరోజుల వ్యవ«ధిలోనే భారీ స్థాయికి పెరిగింది. ఆలయంలోనే ఆటలాడుకునే ఆ బాలుడు ‘బొడ్డ గణేశ‘ (పెద్ద గణపతి) అనేవాడు. నాటి నుంచి ఇది మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది.

మూడంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు, శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలో కలపపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాను చాలా ఆలయాలపై దాడులు చేసినట్లుగానే ఈ ఆలయంపైనా దాడి చేయడానికి వచ్చాడట. ఆలయ ప్రాంగణంలోని బావినీళ్లు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట. తన వెంట ఉన్న సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేసినట్లుగా లాంఛనప్రాయంగా బయటి వైపు గోడపై కత్తితో వేటు వేసి, వెనుదిరిగాడట. టిప్పు సుల్తాన్‌ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది.

మయూరేశ్వర ఆలయం, మహారాష్ట్ర
మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం ఇది. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. స్థానికులు ‘మోరేశ్వర్‌’ అని కూడా అంటారు. మయూరేశ్వరుడు వెలసినందున ఈ క్షేత్రానికి ‘మోర్గాంవ్‌’ అనే పేరు వచ్చింది. ఇది మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉంది. గాణపత్య మతం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో మోర్గాంవ్‌ ఆ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియదు. ఇందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు. మోరయ గోసావి అనే గాణపత్య సాధువు కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయన శిష్యులైన పీష్వా ప్రభువుల హయాంలో ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుంది. మహారాష్ట్రలో ప్రాచీన వినాయక క్షేత్రాలు ఎనిమిది ఉన్నాయి.

వీటిని అష్ట వినాయక క్షేత్రాలని అంటారు. అష్ట వినాయక క్షేత్రాలకు తీర్థయాత్రగా వెళ్లేవారు మోర్గాంవ్‌లోని మయూరేశ్వరుడి దర్శనంతో యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. మయూరేశ్వరుడిని దర్శించుకోకుంటే, అష్టవినాయక యాత్ర పూర్తి కానట్లేనని అంటారు. ‘సింధు’ అనే రాక్షసుడిని చంపడానికి త్రేతాయుగంలో వినాయకుడు ఇక్కడ మయూరవాహనుడిగా షడ్భుజాలతో అవతరించాడని ‘గణేశ పురాణం’ చెబుతోంది. పీష్వాల కాలంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న సమర్థ రామదాసు ఆశువుగా ‘సుఖకర్తా దుఃఖహర్తా’ అనే కీర్తనను ఆలపించాడు. మయూరేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గీతాన్ని ఆలపించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది.

గణపతిపులే, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఆలయం ఇది. రత్నగిరి పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో కొంకణతీరంలో ఉన్న గణపతిపులే గ్రామంలో లంబోదరుడు పడమటి కనుమల దిగువన స్వయంభువుగా వెలశాడు. మిగిలిన ఆలయాల్లోని దేవతామూర్తులు తూర్పుదిక్కుగా ఉంటే, ఇక్కడి వినాయకుడు మాత్రం పశ్చిమాభిముఖుడై కనిపిస్తాడు. పశ్చిమాభిముఖుడైన స్వామి పడమటి కనుమలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. గణపతిపులే గ్రామంలో స్వయంభువుగా వినాయకుడు ఆవిర్భవించడం వెనుక ఒక స్థలపురాణం ఉంది. గతంలో బలభిత్‌ భిడే అనే బ్రాహ్మణుడు గ్రామకరణంగా ఉండేవాడు. ఒకసారి అతను గడ్డు సమస్యల్లో చిక్కుకున్నాడు. సమస్యల నుంచి బయటపడటానికి గ్రామం వెలుపల ఉన్న మొగలివనంలో కూర్చుని తన ఇష్టదైవమైన వినాయకుని ధ్యానిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు.

నాయకుడు కరుణించి, అతనికి కలలో కనిపించి, ఇక్కడ తాను స్వయంభువుగా ఆవిర్భవిస్తానని, తనకు ఆలయం నిర్మిస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత భిడేకు చెందిన పశువుల మందలోని ఆవులు పాలివ్వడం మానేశాయి. పశువులకు కాపలాగా వెళ్లే మహిళ వాటిని నిశితంగా గమనించగా, మొగలివనంలోని ఒక పుట్ట వద్ద ఆవులన్నీ పాలను ధారగా కార్చేస్తుండటం కనిపించింది. ఇదే విషయాన్ని భిడేకు చెప్పడంతో, మనుషులతో చేరుకుని పుట్టగా పేరుకుపోయిన మట్టిని తొలగించగా, వినాయకుని విగ్రహం కనిపించింది. దాంతో ఆయన ఇక్కడ చిన్న ఆలయం నిర్మించి, గణపతిని పూజించడం ప్రారంభించాడు. అయితే, ఇప్పుడున్న ఆలయాన్ని పీష్వా ప్రభువులు నిర్మంచారు.

త్రినేత్ర గణేశ ఆలయం, రాజస్థాన్‌
త్రినేత్ర గణేశయ ఆలయంలో వినాయకుడు మూడు కన్నులతో భక్తులకు కనువిందు చేస్తాడు. రాజస్థాన్‌లోని రణ్‌థాంబోర్‌ కోటలో ఉన్న ఈ ఆలయంలోని వినాయకుడిని ‘ప్రథమ గణేశ’ అని కూడా అంటారు. దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన త్రినేత్ర గణేశ విగ్రహం దాదాపు ఆరున్నర వేల ఏళ్ల కిందటిదని అంచనా. రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగినప్పుడు వారు తొలి ఆహ్వాన పత్రికను ఇక్కడి ప్రథమ గణేశునికే పంపారని స్థలపురాణ కథనం. ఇప్పుడు ఈ ఆలయం వెలసిన కోట రణ్‌థాంబోర్‌ జాతీయ పార్కు పరిధిలో ఉంది.

ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పదమూడో శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హమీర్‌ నిర్మించినట్లు చెబుతారు. హమీర్‌ వినాయకుడికి పరమభక్తుడు. హమీర్‌ ఇక్కడ ఆలయం నిర్మించడం వెనుక కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో రణ్‌థాంబోర్‌ కోటపై అల్లాఉద్దీన్‌ ఖల్జీ దాడి చేశాడు. యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగింది. యుద్ధానికి సిద్ధపడి ముందుగా కోటలోని గోదాముల్లో నిల్వచేసిన తిండి గింజలు, ఇతర నిత్యావసరాలు నిండుకున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజు తనను, తన రాజ్యాన్నీ, ప్రజలనూ కాపాడాలంటూ గణపతిని ప్రార్థించాడు. రాజు హమీర్‌కు గణపతి కలలో కనిపించాడు. ‘రేపటి నుంచి నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి’ అని పలికాడు.

మర్నాటికల్లా ఖిల్జీ సేనలు వెనక్కు మళ్లడంతో యుద్ధం ముగిసిపోయింది. గోదాముల్లో తిండి గింజలు వచ్చి చేరాయి. కోట గోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చర్యకరంగా బయటపడింది. ఈ అద్భుత సంఘటనతో గణపతిపై రాజు హమీర్‌ భక్తివిశ్వాసాలు రెట్టింపయ్యాయి. గణపతిని వృద్ధి సిద్ధి సమేతంగా, గణపతి కొడకులైన శుభ లాభాల విగ్రహాలను, గణపతి వాహనమైన మూషిక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిపేటప్పుడు ఇక్కడి ప్రథమ గణపతికి తొలి ఆహ్వాన పత్రికలు పంపిస్తూ ఉంటారు. ప్రథమ గణపతికి తొలి ఆహ్వానం పంపితే, శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని నమ్ముతారు.

కర్పక వినాయక ఆలయం, తమిళనాడు
వినాయకుని అరుదైన ఆలయాల్లో తమిళనాడులోని కర్పక వినాయక ఆలయం ఒకటి. శివగంగై జిల్లాలోని పిళ్లయ్యార్‌పట్టి గ్రామంలో ఉంది ఈ పురాతన ఆలయం. దీనిని స్థానికులు పిళ్లయ్యార్‌ ఆలయం అని కూడా అంటారు. ఇది గుహాలయం. గుహలో దేవతామూర్తుల పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం గర్భగుడిలోని గుహలో కనిపించే పద్నాలుగు శిల్పాలు పదో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్య కాలానికి చెందినవని అంటారు. పిళ్లయ్యార్‌పట్టి కొండల నడుమ గుహలో వెలసిన కందర్ప వినాయకునికి పాండ్య రాజులు ఆలయాన్ని నిర్మించారు. ఇందులోని మూలవిరాట్టుగా ఉన్న పిళ్లయ్యార్‌– కందర్ప వినాయకుడి విగ్రహం నాలుగో శతాబ్దికి చెందనదిగా చరిత్రకారుల అంచనా. మిగిలిన చోట్ల వినాయకుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే, ఇక్కడ మాత్రం కుడి వైపు తిరిగి ఉండటం విశేషం. ఈ ఆలయంలోని కాత్యాయనిని, పశుపతీశ్వరుడిని, నాగలింగాన్ని కూడా భక్తులు పూజిస్తారు. ప్రస్తుతం చెట్టియార్లలోని నాగరదర్‌ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఏటా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

చింతామన్‌ గణపతి, మధ్యప్రదేశ్‌
మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరమైన ఉజ్జయినిలో వెలసిన గణపతి ఆలయం ఇది. శైవక్షేత్రంగా, శక్తిపీఠంగా పేరుపొందిన ఉజ్జయినిలో వెలసిన ఈ గణపతి భక్తుల చింతలను తీర్చుతాడని, అందుకే ఇక్కడి గణపతిని చింతాహరణ గణపతి అని, చింతామణి గణపతి అని కూడా అంటారు. ఈ ఆలయంలోని గణపతి స్వయంభువుగా వెలిశాడు. వృద్ధి, సిద్ధి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా ఎప్పుడు వెలశాడో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే చరిత్రపూర్వయుగం నుంచే ఇక్కడ స్వయంభూ గణపతి వెలసి ఉండవచ్చని కొందరి అంచనా.

మాల్వా రాజ్యాన్ని పాలించిన పరమార్‌ రాజులు పదకొండు–పన్నెండు శతాబ్దాల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడిని, మహాకాళిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మహాకాళేశ్వర ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న  చింతామన్‌ గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో గణపతి ఎదుటనే మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. విష్ణువుకు గల సహస్రనామాలలో ‘చింతామణి’ కూడా ఒకటి. అందువల్ల కూడా ఇక్కడ వెలసిన గణపతిని చింతామణి గణపతి అంటారని చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు గణపతితో పాటు విష్ణువుకు కూడా పూజలు చేసి వెళుతుంటారు.

మహావినాయక ఆలయం, ఒడిశా
ఐదుగురు దేవతలను ఏక దైవంగా పూజించే అరుదైన ఈ ఆలయం ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా చండిఖోల్‌లో ఉంది. శివుడు, విష్ణువు, దుర్గ, సూర్యుడు, వినాయకుడు– ఈ ఐదుగురినీ వినాయకుడి రూపంలోనే ఇక్కడ ఆరాధిస్తారు. ఇంకో విశేషమేమిటంటే, ఈ ఆలయంలో పవళింపు సేవ ఉండదు. సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ ఆలయాలను మూసివేసే ముందు పవళింపు సేవ చేస్తారు. ఐదుగురు దేవతలూ ఏకరూపంలో కొలువుదీరడం వల్లనే ఇక్కడ పవళింపు సేవ చేయరని చెబుతారు. ఐదుగురు దేవతల్లో శివ కేశవులు ఉండటం వల్ల ప్రసాదంలో బిల్వపత్రిని, తులసి ఆకులను రెండింటినీ ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఆలయంలో అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. చండిఖోల్‌ పట్టణం రెండు కొండల నడుమ వెలసింది. మొదటి కొండ దిగువన చండీ ఆలయం, రెండో కొండ దిగువన మహావినాయక ఆలయం వెలశాయి.

రెండు ఆలయాల వద్ద రెండు విశాలమైన తటాకాలు కనిపిస్తాయి. కళింగ రాజ్యాన్ని తొమ్మిదో శతాబ్ది నుంచి పన్నెండో శతాబ్ది వరకు పరిపాలించిన కేసరి వంశ రాజులు ఇక్కడి మహాగణపతి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి కొండలను వరుణుడి కొండలు అంటారు. ధర్మరాజు వరుణుడి కొండల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించాడనే కథనాన్ని కూడా స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ధర్మరాజు కోటను ‘తెలిగఢ్‌’కోట అంటారు. మహా వినాయకుడి ఆలయానికి చేరువలో కనిపించే కోట శిథిలాలు ధర్మరాజుకి చెందినవేనని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత కుంతీదేవి ఈ కోట నుంచే బంగారు సంపెంగను శివునికి కానుకగా సమర్పించిందని చెబుతారు.

Source: https://www.sakshi.com/news/funday/most-famous-ganesh-temples-india-1220532

Leave Your Comment