logo

header-ad
header-ad

పెళ్లి ఫిక్స్ అయ్యింది.. నన్ను మరచిపో అంది

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు పరిచయం అవుతారు. ఆ పరిచయాలు స్నేహాలుగా, ప్రేమలుగా మారి కొన్ని విజయం సాధిస్తే, మరి కొన్ని విఫలం అవుతాయి. ఎవరు ఎప్పుడు ఎందుకు పరిచయం అవుతారో తెలియదు కానీ, జీవితంలో మరిచిపోలేని బాధను మిగిల్చి వెళ్లిపోతారు. నేను ఇంటర్‌ మీడియట్ జాయిన్ అయిన రోజే నాతో పాటు ఒక అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది. ఆమెను నేను లవ్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. అయితే నాకు కొద్దిగా మాట్లాడే ధైర్యం ఎక్కువ.. సూటిగా మాట్లాడే తత్వం. వెంటనే పరిచయం చేసుకున్నా. తన పేరు లతిక అని చెప్పింది. అలా కాల గమనంలో మా స్నేహం గాఢమైన స్నేహంగా మారిపోయింది. ఆమెకు ఎలా ఉండేదో తెలియదు కానీ తను నా వెంట ఉంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోయే వాడిని.

‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పే ధైర్యం ఉంది. కానీ, ఒకవేళ నన్ను తను అపార్థం చేసుకుంటుందేమో అన్న భయం. నిన్ను లవ్ చేయడం లేదు అంటే, ప్రేమతో పాటు స్నేహం కూడా చెడిపోతుంది. అందుకే మరో సంవత్సరం పాటు చెప్పకుండా ఉండిపోయా. తరువాత అందరం వీడ్కోలు తీసుకునే సమయం వచ్చింది. తను దూరం అవుతుంది అన్న ఆలోచనే నన్ను ఒక్క నిమిషం కూడా నిలువన్విలేదు! ఊపిరి ఆగిపోతున్నట్టు ఉంది. ఇక ఏదైనా సరే చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఒక అరగంట తరువాత తనే నన్ను పిలిచింది. ‘ఏంటి అలా ఉన్నావ్‌?ఏమైంది? ’ అని అడిగింది. కొద్ది సేపు వరకు మౌనంగా ఉండిపోయా. ‘చెప్పు ఏమైంది?’ అని మళ్లీ అడిగింది. అప్పుడు చెప్పా ‘ఈ రోజుతో నువ్వు నాకు పూర్తిగా దూరం అవుతావు.

ప్రతిరోజు నిన్ను కలవలేను, నీతో మాట్లాడలేను, నిన్ను చూడలేను.. నువ్వు లేకుండా నేను ఉండలేను.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. నువ్వు లేకుండా నేను లేను.’ అన్నాను. వెంటనే తను ‘ఎందుకు అలా అనిపిస్తుంది’ అని కొంటెగా నవ్వుతూ అడిగింది. ‘ఏమో తెలియదు’ అని అన్నాను. తల దించుకుని ఉన్నా. ఏమైందో తెలియదు. నేను అసలు అలా జరుగుతుందని ఊహించలేదు. మెరుపు వేగంలా  వచ్చి నన్ను గట్టిగా హత్తుకుంది. అంతే ఆ దెబ్బకు మరో మూడు సంవత్సరాల పాటు కలిసి డిగ్రీ చేశాం. ప్రతి ప్రేమ జంట ఎంత ఎంజాయ్ చేస్తారో ఆంతకు మించి ఎంజాయ్‌ చేశాం. ఒకరోజు సడెన్‌గా వచ్చి ‘నాకు వివాహం ఫిక్స్ అయ్యింది ఇక నుండి నన్ను మరచిపో’ అని వెళ్లిపోయింది. తనతో అదే చివరి క్షణం. అంత తేలికగా ఎలా వెళ్లిపోయిందో అర్థం కావడం లేదు. 

ఒక అమ్మాయి అలా నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే ఏ అబ్బాయి అయిన ఏం చేస్తాడు. రెండున్నర సంవత్సరాలు పిచ్చి పట్టినట్టుగా పిచ్చివాడిలా అయిపోయా. నాకు జీవితం మీద ఆశ లేని సమయంలో ఒక అమ్మాయి మళ్లీ నా జీవితంలోకి వచ్చింది. రెండున్నర సంవత్సరాల తరువాత బలవంతంగా నేను వెళ్లిన ఒక పెళ్లిలో పరిచయం అయింది. అది అనుకోని, ఊహించని పరిచయం. మళ్లీ నా జీవితంలో ఆనందాలు, సంతోషాలు. నా జీవితంలో అన్నీ ఊహించని పరిణామాలు. తను పరిచయం అవ్వటం, తనే నాపై ప్రేమను వ్యక్తం చేయడం. వాళ్ల అమ్మా, నాన్నలను కూడా ఒప్పిండడం.. మా పెళ్లి నిర్ణయం అన్నీ ఒకదాని వెంట ఒకటి అనుకోకుండా జరిగిపోయాయి. ఇప్పుడు మా వివాహ సమయం కోసం ఎదురు చూస్తున్నా. నాకు అర్థం అయిన విషయం ఏంటంటే! అబ్బాయిల జీవితం ఒక అమ్మాయితో ముడి పడి ఉంటుందని. ఓ అమ్మాయి నన్ను ప్రేమించి వదిలి వెళ్ళిపోయింది. మరో అమ్మాయి నన్ను మళ్లీ మనిషిని చేసి కాపాడింది.

- అనూప్‌

Source: https://www.sakshi.com/news/lifestyle/love-stories-telugu-anup-happy-ending-telugu-love-story-1245223

Leave Your Comment