logo

header-ad
header-ad

మళ్లీ నటన వైపు.. ఖుష్బూ

ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నటి ఖుష్బూ ఇపుడు మళ్ళీ నటనపై ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా బుల్లితెర సీరియళ్లలో నటించేందుకు ఆమె దృష్టి సారించారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌, శరత్‌ కుమార్‌, రాధిక, కరుణాస్‌, ఖుష్బూ వంటి అనేక మంది సినీ ప్రముఖులు క్రియాశీలక పాత్ర పోషించారు. వీరిలో కమల్‌, ఖుష్బూ, కరుణాస్‌ వంటివారు పోటీ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో వారు నటనపై దృష్టిసారించారు. ఆ కోవలో ఇప్పటికే కమల్‌ హాసన్‌, కరుణాస్‌లు సినిమాల్లో బిజీ అయ్యారు. అలాగే, శరత్‌ కుమార్‌, రాధిక కూడా తమతమ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

అదే విధంగా బీజేపీ మహిళా నేతగా ఉన్న ఖుష్బూ కూడా మళ్ళీ సీరియల్స్‌లో నటించి నటిగా బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థపై అనేక సీరియల్స్‌ నిర్మించిన ఆమె.. ఇపుడు ఓ మెగా సీరియల్‌ నిర్మించే పనిలో నిమగ్నమైవున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చిరుత్తై శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ‘అణ్ణాత్త’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే, మరికొన్ని చిత్రాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని, వీటిలో మంచి కథలతో కూడిన మూవీల్లో చేసేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

Source: https://chitrajyothy.com/telugunews/khushbu-sundar-eye-on-acting-chj-kbk-1921072008045035

Leave Your Comment