logo

header-ad
header-ad

యంత్రాంగంపై మోదీ ముద్ర!

-ఐఏఎస్, గ్రూప్ ఏ సర్వీసులకు ఉమ్మడి ఫౌండేషన్ కోర్సు

-సాధారణ పరిపాలనతో పాటు సాంకేతిక, ఆర్థిక అంశాలపై బోధన

-ఈ ఐదేండ్ల కాలాన్ని వ్యర్థం కానివ్వనంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: మన దేశ అత్యున్నత అధికార యంత్రాంగంలో కీలక సంస్కరణలు తీసుకురావడానికి మోదీ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ సర్వీసులతో పాటు ఐఏఎస్ సర్వీసులకు ఉమ్మడి ఫౌండేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకు రానున్నది. 2020-21 నుంచి ఈ కోర్సు మొదలు కానున్నది. అధికార యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న ప్రతికూల భావనల్ని తొలగించే ప్రయత్నంలో దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నారు. గత నెలలో జరిగిన ఏక్ భారత్, శ్రేష్ట భారత్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తమ మొదటి ఐదేండ్ల ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు (టాప్ బ్యూరోక్రట్స్) వ్యర్థం చేశారని, అయితే, తాను ఈ ఐదేండ్ల (రెండోసారి అధికారంలోకి వచ్చిన) కాలాన్ని వ్యర్థం కావడానికి అనుమతించనన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో కలిగే జాప్యానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని ఆయన ఆరోపించారు. ఇటీవల గుజరాత్‌లో కేవడియలోని ఐక్యతా విగ్రహం సమీపంలో నిర్వహించిన ఆరంభ్ సదస్సులో పాల్గొన్న దాదాపు 744 ట్రైనీ ఐఏఎస్, గ్రూప్ ఏ సర్వీసు అధికారులను ఉద్దేశించి మోదీ మాట్లాడటం తెలిసిందే. అధికార యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న ప్రతికూల భావనను తొలిగించాలని శిక్షణలో ఉన్న అధికారులకు ఆయన సూచించారు.

దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర కీలకమన్నారు. సివిల్ సర్వీసెస్ అభివృద్ధిలో సర్దార్ పటేల్ కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాధారణ పరిపాలనా పద్దతుల గురించి ఊకదంపుడు పాఠాలను బోధించకుండా భవిష్యత్తు సాంకేతికత, సారూప్య ఆలోచనా విధానం వంటి నవ్య అంశాలపై చర్చించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థ దీనికి సహకరించింది. సివిల్ సర్వీసులపై ప్రభావం చూపే ప్రస్తుత సమస్యలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఎల్‌బీఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కృత్రిమ మేథ, బిగ్ డేటా, తయారీ, లాజిస్టిక్స్‌లో భవిష్యత్తు ప్రణాళికలు ఇతరత్రా అంశాలపై కూలంకషంగా వివరించారు. ఆర్థిక సంబంధిత అంశాలపై తగిన అవగాహన కోసం ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ బ్యాంకుకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఉపన్యసించారు. ప్రభుత్వ యంత్రాంగం పని విధానంలో క్రమంగా మార్పులు వచ్చాయన్న విమర్శలున్నాయి. జాతి ప్రయోజనాల కోసం సేవ చేయడం నుంచి స్వప్రయోజనాలే ఎజెండాగా ప్రభుత్వాధికారులు పని చేస్తున్నట్టు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. పని విధానంపై చూపుతున్న శ్రద్ధ ఫలితాలపై చూపడం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు తమకు తాముగా గొప్పగా ఊహించుకొంటారని, అయితే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్లు పనిచేయడం ఇప్పుడు అవసరమని, ప్రజలతో మమేకం కావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Source: https://www.ntnews.com/NationalNews-in-Telugu/joint-foundation-course-for-ias-and-group-a-services-1-3-616277.html

Leave Your Comment