ఇసుక కొరతపై భారీ ఆందోళనకు సిద్ధమైంది జనసేన. అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో ఉండే విశాఖను లాంగ్ మార్చ్ కోసం ఎంచుకుంది. భవన నిర్మాణ, వాటి అనుబంధ వృత్తులపై ఆధారపడ్డ కార్మికుల సంఖ్య సుమారు లక్ష వరకూ ఉంటుందని అంచనా. భవన నిర్మాణ కూలీలు, పార్టీ కార్యకర్తలతో సాగరతీరంలో వేల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది జనసేన. ఇందుకు అవసరమైన జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల బాధ్యతలను నాదెండ్ల మనోహర్, నాగబాబులకు అప్పగించారు జనసేనాని.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి లాంగ్‌మార్చ్ మొదలవుతుంది. సీఎంఆర్ సెంట్రల్, రామా టాకీస్, ఆశీల్‌మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకూ రెండున్నర కిలోమీటర్ల పొడవునా మార్చ్ సాగుతుంది. ఆపై బహిరంగ సభ నిర్వహిస్తారు. మరోవైపు సభా వేదికపై నిన్నంతా హైడ్రామా నడిచింది. ఉమెన్స్ కాలేజీ ఎదురుగా వేదికనిర్మాణం విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లాంగ్ మార్చ్‌ను అడ్డుకోవడానికి కుట్ర చేస్తోందని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్కడికి చేరుకొని పోలీసులతో చర్చలు జరిపారు. చివరకు సడలించిన అనుమతులతో సభా వేదిక నిర్మాణానికి పోలీసులు ఒప్పుకున్నారు. దీంతో మూడు గంటల పాటు నడిచిన హైడ్రామాకు తెరపడింది. ఎట్టిపరిస్థితుల్లో లాంగ్ మార్చ్ విజయవంతం చేస్తామని మనోహర్ ప్రకటించారు.
ప్రతి నియోజకవర్గంలోనూ కీలకమైన నేతలను ఐదుగురిని గుర్తించి, వారికి జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైళ్లు, బస్సుల్లోనూ.. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తోంది జనసేన. లాంగ్ మార్చ్ కోసం వస్తున్న వాహనాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ముందు పార్కింగ్ అనుమతి ఇచ్చినప్పటికీ, యూనివర్సిటీ యాజమాన్యం చివరినిమిషంలో అనుమతులను రద్దుచేసింది. దీంతో ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ప్రాంగంణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది జనసేన. ఇక, పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు జనసేన లాంగ్ మార్చ్‌లో టీడీపీ ప్రత్యక్షంగా పాల్గొంటోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస వెళ్తారని చెప్పారు చంద్రబాబు. అయితే ఈ నిరసనకు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. మార్చ్‌లో పాల్గొనాలని బీజేపీ ఆహ్వానించడం తమకు ఆమోద యోగ్యం కాదని ఏపీ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఇప్పటికే ఈ సమస్యపై తాము వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నామని లేఖలో వివరించారు లెఫ్ట్ నాయకులు. మరోవైపు పవన్‌తో కలిసి వేదిక పంచుకోబోమని ప్రకటించిన బీజేపీ.. ఈ నిరసనకు మాత్రం సంఘీభావం తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.