logo

header-ad
header-ad

ఫేస్‌బుక్ కథ ముగిసినట్లేనా? మైక్రోసాఫ్ట్, కోకాకోలా సహా పలు ఎంఎన్‌సీల బాయ్‌కాట్, ప్రకటనల నిలిపివేత

ద్వేష పూరిత కంటెంట్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ ఫేస్‌బుక్‌లో తమ ప్రకటనల్ని నిలిపేశాయి ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలైన ఫోర్డ్, అడిడాస్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ వంటి సంస్థలు. దీంతో గత శుక్రవారం ఆ సంస్థ మార్కెట్ విలువ ఒక్కసారిగా 8 శాతనికి పడిపోయింది. దీంతో ఫేస్‌బుక్ భవిష్యత్‌పై కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి.

ఫేస్‌బుక్ పరిశోధనల ప్రకారం బహిష్కరణలు తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

బానిసలు ఉత్పత్తి చేసే వస్తువులకు దూరంగా ఉండేలా 18వ శతాబ్దంలో తలెత్తిన బానిసత్వ నిర్మూలన ఉద్యమం బ్రిటిష్ ప్రజల్ని ప్రోత్సహించింది. నిజానికి అది అద్భుతంగా పని చేసింది. దాదాపు 3లక్షలమంది చక్కెరను కొనడం నిలిపేశారు. ఫలితంగా బానిసత్వాన్ని రూపుమాపాలంటూ మరింత ఒత్తిడి పెరిగింది.

బహిష్కరణను రాజకీయ సాధనంగా ఉపయోగించడంలో జరుగుతున్న తాజా ఉద్యమం ద స్టాప్ హేట్ ఫర్ ఫ్రాఫిట్ ప్రచారం. జాతి వివక్షకు, విద్వేషాలకు సంబంధించిన కంటెంట్‌ను తన ప్లాట్ ఫాం నుంచి తొలగించడంలో ఫేస్‌బుక్ తగినంత ప్రయత్నం చేయడం లేదన్నది ఈ ప్రచారం చేస్తున్న ప్రధాన ఆరోపణ.

ఫేస్ బుక్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలకు చెందిన కంపెనీల నుంచి తమ ప్రకటనల్ని ఉపసంహరించుకునేలా చేయడంలో పెద్ద పెద్ద సంస్థలను స్టాప్ హేట్ ఫర్ ఫ్రాఫిట్ ప్రచారం ఒప్పించగల్గింది.

తాజాగా ఫోర్డ్, అడిడాస్, హెచ్‌పీ సంస్థలు కూడా ఈ ప్రచారానికి మద్దతు పలికాయి. గతంలో ఇదే పని చేసిన కోకోకోలా, యూనిలివర్, స్టార్‌బక్స్ కంపెనీల బాటలో నడుస్తూ ఫేస్ బుక్ నుంచి తమ ప్రకటనల్ని ఉపసంహరించుకున్నాయి.

అదే సమయంలో రెడిట్, ట్విచ్ వంటి ఇతర ఆన్ లైన్ ప్లాట్ ఫాంలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

‘నమ్మకం పోయింది’

ఈ బహిష్కరణ ఫేస్ బుక్‌పై ప్రభావం చూపగల్గుతుందా? ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే అవును అనక తప్పదు. ఫేస్‌బుక్‌కు ప్రకటనల నుంచే మెజార్టీ ఆదాయం వస్తుంది.

నమ్మకం కోల్పోవడం, నైతిక నియమావళిని పాటించకపోతే ఎంతటి వ్యాపార సామ్రాజ్యమైనా నాశనమవుతుందని బీబీసీ నిర్వహించిన టుడే ప్రోగ్రామ్ కార్యక్రమంలో ఎవివాకు చెందిన ఇన్వెస్టర్ డేవిడ్ కుమ్మింగ్ వ్యాఖ్యానించారు.

గత శుక్రవారం నాడు ఫేస్ బుక్ షేర్ ధర ఏకంగా 8 శాతం పడిపోయింది. ఫలితంగా ఫేస్ బుక్ అధినేత జుకర్‌బర్గ్ ఆస్తి సుమారు 6 బిలియన్ పౌండ్లు కరిగిపోయింది.

కానీ ఇది నిజంగా ఫేస్‌బుక్ దీర్ఘ కాలిక భవిష్యత్తుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చా? ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పలేం.

సోషల్ మీడియా సంస్థలను బహిష్కరించడం ఇదే మొదటి సారి కాదు. 2017లో జాతి వివక్షకు సంబంధించిన వీడియోలు, అలాగే హోమో సెక్సువల్స్‌కి వ్యతిరేకంగా ఉండే వీడియోల తర్వాత తమ ప్రకటనల్ని వేయడంతో మేజర్ బ్రాండ్లన్నీ ఒక దాని తర్వాత ఒకటి యూట్యూబ్‌లో తమ ప్రకటనల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటిస్తూ వచ్చాయి. అయితే ఆ బహిష్కరణ విషయం ఇప్పుడు పూర్తిగా మర్చిపోయినట్టే. ఆ తర్వాత యూట్యూబ్ తన విధానాలలో కాస్త సర్దుబాట్లు చేసింది. మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్‌ పరిస్థితి బాగానే ఉంది.

ఈ బహిష్కరణ వల్ల ఫేస్ బుక్‌కి పెద్దగా హాని జరగదని చెప్పడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి.

చిన్న, మధ్యతరహా సంస్థల వల్లే ఎక్కువ ఆదాయం

మొట్ట మొదట చూస్తే చాలా కంపెనీలు ఈ బహిష్కరణను కేవలం జులై నెలకు మాత్రమే పరిమితం చేశాయి.

ఇక రెండో కారణం చూస్తే లక్షలాది చిన్న, మధ్య తరహా కంపెనీల నుంచే ఫేస్ బుక్‌ ఎక్కువ ఆదాయం సంపాదిస్తుంది.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం అత్యధికంగా ఖర్చు పెడుతున్న వంద బ్రాండ్లు గత ఏడాది ఫేస్‌బుక్‌కు ప్రకటనల రూపంలో సమకూర్చిన ఆదాయం 4.2 బిలియన్ డాలర్లు. ఇది ఫేస్ బుక్ మొత్తం ప్రకటనల ఆదాయంలో కేవలం 6 శాతం మాత్రమే.

మెజార్టీ చిన్న, మధ్య తరహా సంస్థలు ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో ప్రకటనల్ని ఆపేయాలన్న నిర్ణయంపై ఎటువంటి అంగీకారానికి రాలేదు.

భారీ సంఖ్యలో ఉన్న చిన్న చిన్న సంస్థలు ప్రకటనలు చేయకుండా ఉండలేవని ప్రముఖ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ డిజిటల్ విస్కీ సంస్థలో వ్యూహకర్తగా పని చేస్తున్న మాట్ మారిసన్ బీబీసీతో చెప్పారు.

చిన్న చిన్న సంస్థలకు టీవీల్లో ప్రకటనల్ని ఇచ్చేంత స్థోమత ఉండదు. అందుకే అవి తక్కువ ధరల్లో ప్రచారానికి అవకాశం ఉన్న ఫేస్ బుక్ వంటి సంస్థల్ని ఆశ్రయించడం తప్పనిసరి అని ఆయన చెప్పుకొచ్చారు.

కొన్ని రకాలుగా చూస్తే నచ్చజెప్పే విషయంలో ఫేస్ బుక్ ముందుంటుంది. నిజానికి తన సంస్థలో ఎటువంటి మార్పునైనా చేసే విధంగా జుకర్‌బర్గ్‌కు అమితమైన అధికారాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఉంది ఆ సంస్థ నిర్మాణం కూడా. ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని సాధించగలరు.

మీరు కేవలం ఒక్క మనిషి మనసు మాత్రమే మార్చాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మార్చలేకపోవచ్చన్నది కూడా వాస్తవమే. ఇతర కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చినట్టు జుకర్‌బర్గ్‌పై షేర్ హోల్డర్లు ఒత్తిడి తీసుకొని రాలేరు. ఒక వేళ ఆయన దీనిపై స్పందించకూడదు అనుకుంటే.. స్పందించరు అంతే.

ఇప్పటి వరకు అయితే ఈ విషయంలో ఆయన ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం నాడు ద్వేషపూరిత కంటెంట్‌ను ట్యాగ్ చెయ్యడం మొదలు పెడతామని ఫేస్ బుక్ ప్రకటించింది. బహుశా ఈ వారంలో దానికి కొనసాగింపుగా మరిన్ని ప్రకటనలు ఉండవచ్చు. అయితే స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ విషయంలో ఈ మార్పులు సరిపోవు.

మరోవైపు ఇతర సంస్థలు ఎవరికి వాళ్లు చర్యలు ప్రారంభించాయి. ద డోనల్డ్ ట్రంప్ ఫోరమ్‌ను నిషేధిస్తున్నట్టు రెడిట్ సోమవారం ప్రకటించింది. ఇందులోని సభ్యులు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నిజానికి ఈ కమ్యూనిటీకి, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కి అధికారికంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్ల పోస్టులు రీచ్ అయ్యే విషయంలో రెడిట్ ఆంక్షలు విధించక మునపు వారు ట్రంప్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండేవారు. అంతేకాదు అటు ట్విచ్ కూడా ట్రంప్ ప్రచారకర్తలు నిర్వహిస్తున్న అకౌంట్‌ను నిషేధించింది.

వీడియో స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్‌లో ఉన్న రెండు ట్రంప్ ప్రచార వీడియోలు ద్వేష పూరిత ప్రవర్తన విషయంలో తమ నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించింది.

“రాజకీయాలు లేదా వార్తలైనంత మాత్రాన మేం ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోం” అంటూ ట్విచ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

అన్ని సోషల్ మీడియా కంపెనీలకు ఈ ఏడాది కాస్త కఠినంగానే ఉండబోతోంది.

అందుకు ఫేస్ బుక్ కూడా మినహాయింపేం కాదు. అయితే సంస్థలన్నీ తమ తమ బ్యాలెన్స్ షీట్లకు అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటాయి.

రానున్న శీతాకాలం వరకు ఈ బహిష్కరణ కొనసాగినా, మరిన్ని కంపెనీలు అదే బాటలో నడిచినా సోషల్ నెట్ వర్క్ సంస్థలకు 2020 నిర్ణయాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు.

Source: https://www.bbc.com/telugu/international-53239143

Leave Your Comment