logo

header-ad
header-ad

అంతర్జాతీయంగా భారత్‌ కీలకపాత్ర పోషించాలి

పారిస్: కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ వారి అభిప్రాయాన్ని సుస్పష్టం చేశారు. ఇరువురు గురువారం దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంతో పాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మెక్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధాని(మోదీ) కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని.. ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా చర్చించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశాను’’ అని తన వైఖరిని తెలిపారు.

ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడిన ఫ్రాన్స్‌ అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఉభయ దేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మైత్రి కొనసాగుతుందన్నారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు 90నిమిషాల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. మోదీ ఫ్రాన్స్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్‌ వెళతారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 25న తిరిగి ఫ్రాన్స్‌ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు.

Source: https://www.eenadu.net/nationalinternational/newsdetails/7/2019/08/23/146639/India-should-get-a-bigger-global-role-French-PM

Leave Your Comment