ఇస్లామాబాద్: జీహాదీ సంస్థలకు పాకిస్థాన్ శిక్షణనిచ్చిందన్న విషయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే అంగీకరించారు. అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికా తమని నిందించడాన్ని తప్పుబడుతూ.. ఇమ్రాన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. 1980లో అప్పటి సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు శిక్షణనిచ్చినట్లు చెప్పారు. అమెరికాకు చెందిన సీఐఏ దీనికి నిధులు సమకూర్చిందన్నారు. దీన్ని ఆయన పాక్ చేసిన పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. అఫ్గాన్‌కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయని.. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని చెప్పుకొచ్చారు. అప్పట్లో తటస్థంగా ఉండి ఉంటే ఈ అపవాదు మూటగట్టుకునే వాళ్లం కాదన్నారు.
అమెరికాకు మద్దతుగా పాక్ చేసిన సాయమే ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైందని ఇమ్రాన్ ఆరోపించారు. ముజాహిదీన్ల పోరాటం కారణంగా తాము 70వేల మంది ప్రాణాలను కోల్పోయామన్నారు. అలాగే 10వేల కోట్ల డాలర్లు నష్టాపోయామన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చి నాటి పాక్ నాయకులు యువత భవిష్యత్తుని నాశనం చేశారన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత సాధించింది ఏమీ లేదని.. కేవలం ‘ఉగ్రముఠాల స్థావరం’గా దేశంపై ముద్రపడిందన్నారు.
పాక్‌లో 30 వేల నుంచి 40వేల మంది సాయుధులైన ఉగ్రవాదులు ఉన్నారని ఇమ్రాన్‌ఖాన్ గతంలో అంగీకరించిన విషయం తెలిసిందే. కశ్మీర్ విషయంలో పాక్‌కు అంతర్జాతీయంగా మద్దతు కొరవడడంతో ఇమ్రాన్ ఒక్కొక్కటిగా తాము చేసిన తప్పులను అంగీకరిస్తున్నారు.

Source: https://www.eenadu.net/mostread_articles/119010233/Imran-khan-confessed-the-links-with-jihadis.