logo

header-ad
header-ad

2021.. టెక్నాలజీ నామ సంవత్సరమే.. ఎందుకంటే!

ప్రపంచాన్ని నాశనం చేయడంతోపాటు కొత్త కొత్త అలవాట్లు నేర్పిన కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా.. 2021 టెక్నాలజీ పరంగా ఘనమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్న కరోనా మహమ్మారి.. ప్రజల్ని డిజిటల్‌ వైపు నడిపించింది. వర్క్‌ ఫ్రం హోం మొదలుకొని ఆన్‌లైన్‌ క్లాసుల వరకు ప్రతీది డిజిటలైజ్‌ కావడంతో రానున్న రోజులు టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని నిపుణులు అంటున్నారు.  

కొవిడ్‌ అంటువ్యాధి ప్రజలను దూరంగా ఉండేట్లు చేసినప్పటికీ.. సాకేంతికతకు ప్రజలను దగ్గరకు చేసింది. వర్చువల్‌ ఇంటరాక్షన్‌ పెంచేందుకు ప్రజలు యాప్‌లను వినియోగించడంపై ఆధారపడేట్లు చేసింది. డిజిటల్‌ చెల్లింపులను సులభతరం చేసింది.

5 జీ వేగంలో ప్రయాణం

చాలా కాలంగా 5 జీ ని అందుకోవడం గురించి ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశంలో 5 జీ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు చాలా అమ్ముడవుతున్నాయి. అయితే 5 జీ నెట్‌వర్క్ స్పెక్ట్రం కేటాయింపు, వేలం ప్రక్రియను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్నది. బహుశా ఏప్రిల్ నుంచి దేశంలోని మెట్రో నగరాల ఎంపిక సర్కిళ్లలో  5 జీ ట్రయల్స్ ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 2021 ఆగస్టు తర్వాత 5 జీ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు రిలయన్స్‌ జియో ఇప్పటికే ప్రకటించింది. 5 జీ రాకతో డిజిటల్ కంటెంట్ చాలా ప్రయోజనం పొందుతుంది. వైద్య, పారిశ్రామిక రంగాలకు కూడా 5 జీ ప్రయోజనాలు లభిస్తాయి. 5 జీ రాకతో ఇంటర్నెట్ వేగం విప్లవాత్మకంగా మారుతుంది. 4 జీతో పోలిస్తే 5 జీ డౌన్‌లోడ్ వేగం 10 నుంచి 12 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం, భారతదేశంలో గరిష్టంగా 4 జీ డౌన్‌లోడ్ వేగం 33.3 ఎమ్‌బీపీఎస్ గా ఉన్నది. అదే 5 జీ అందుబాటులోకి వస్తే డౌన్‌లోడ్ వేగం 200 ఎమ్‌బీపీఎస్ నుంచి 370 ఎమ్‌బీనీఎస్ వరకు ఉంటుంది. 5 జీ వేగం విషయంలో సౌదీ అరేబియా, దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉన్నాయి.

మొబైల్‌ ఫోన్లే ఆట స్థలాలు

ఇప్పటివరకు ఏవో చిన్నచిన్న ఆటలు స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి రాగా.. కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త గేమ్స్‌ మొబైళ్లను ముంచెత్తాయి. పబ్‌జీ వంటి ఇంటర్నెట్‌ ఆధారిత ఆటకు ఎనలేని ప్రచారం వచ్చింది. దీనిపై కేంద్రం నిషేధం విధించడంతో దీనిని పోలిన మరో ఆన్‌లైన్‌ గేమ్‌ను గేమింగ్‌ సంస్థలు యువత ముందుకు తీసుకొచ్చాయి. భారతదేశం గేమింగ్ ప్రపంచానికి భారీ మార్కెట్. 2020 లో లాక్‌డౌన్‌ సమయంలో డిజిటల్‌ గేమింగ్‌ బలం కనిపించింది. పబ్‌జీకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు పలు కంపెనీలు భారతీయ గేమింగ్ పరిశ్రమలో మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, పేటీఎం వంటి సంస్థలు కూడా ఈ-స్పోర్ట్స్ వ్యాపారంలోకి ప్రవేశించాయి. 2021 లో 5 జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ-స్పోర్ట్స్ రూపాంతరం చెందడం ఖాయమని చెప్పవచ్చు. ఈ-స్పోర్ట్స్‌లో కూడా చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనిలో ఆటగాళ్లతో పాటు ఆట ఆడే, నిర్వహించే, ఆట రూపకల్పన, అభివృద్ధి చేసే ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఉంటాయి.

ఛార్జర్, ఇయర్‌ఫోన్లు మర్చిపో..!

ఐఫోన్‌తో ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లను అందించడం ఆపిల్‌ సంస్థ గత ఏడాది మానేసింది. 2021 లో అన్ని ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇదే ధోరణి కనిపించనున్నది. షియోమి, శామ్‌సంగ్‌తో పాటు చాలా కంపెనీలు ఇప్పటికే ఈ కోతను ప్రకటించాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఈ-వ్యర్థాలను తగ్గించడానికి కారణంతోపాటు 'ఆదాయ వ్యూహం' కూడా ఈ కోత వెనుక ఉన్నది. పరిశ్రమ పూర్తిగా వైర్‌లెస్‌గా ఉండటానికి మార్గాలు సిద్ధమయ్యాయి. వినియోగదారులు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ అలవాటును కోల్పోయారు. అలాగే, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌తో కూడా వినియోగదారులు అలవాటుపడాలని ఇప్పుడు కంపెనీలు కోరుకుంటున్నాయి.

పుష్కలంగా మడతపెట్టే స్మార్ట్‌ఫోన్

2020 సంవత్సరంలో అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ సొంత స్మార్ట్‌ఫోన్‌లను ఫోల్డింగ్‌ స్క్రీన్లతో ప్రారంభించాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు చాలావరకు పాత క్లెయిమ్ షెల్ డిజైన్ లాగా తెరుచుకుంటాయి. స్క్రీన్‌ను పుస్తకం లాగా మడుచుకోవచ్చు. 2021 లో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లలో మరెన్నో నమూనాలు కనిపించనున్నాయి. రోల్ చేయడానికి వీలుండే స్క్రీన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. డిజైన్ ద్వారా రోల్ చేసే స్క్రీన్ చాలా మెరుగ్గా ఉంటుంది. బుక్‌ వంటి స్క్రీన్ మడతలు మడత మధ్యలో కనిపిస్తాయి. అలాగే, మడత తర్వాత ఫోన్ మందంగా మారుతుంది. క్లెమ్‌షెల్ డిజైన్‌లో ముడతలు పడతాయనే భయం కూడా ఉన్నది. 

వీడియో కెమెరాపై ఎక్కువ దృష్టి

2020 కి ముందు, స్మార్ట్‌ఫోన్ కెమెరాల దృష్టి ఎక్కువగా ఫొటోలు తీసుకోవడంపై ఉండేది. 2021 లో మాత్రం వీటి స్థానంలో వీడియో కెమెరాలు ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ 12 సిరీస్‌లో డాల్బీ విజన్‌పై దృష్టి పెట్టగా.. నోట్ 20 అల్ట్రాలో 8 కే వీడియో రికార్డింగ్, మాన్యువల్ వీడియో షూటింగ్ మోడ్ కూడా ఉన్నాయి. అదే సమయంలో గింబాల్ వంటి స్థిరీకరించిన వీడియో, ఐ ఆటోఫోకస్ వంటి వీడియోలను ఇవ్వడం ద్వారా వివో ఎక్స్ సిరీస్ ముందు వరుసలో నిలిచింది. 2021 లో మార్కెట్లోకి వచ్చిన ప్రతి రెండవ-మూడవ స్మార్ట్‌ఫోన్లలో వీడియో కొత్తదనాన్ని చూడొచ్చు. 

Source: https://www.ntnews.com/science-technology/how-about-2021-for-technology-120434

Leave Your Comment