logo

header-ad
header-ad

హైదరాబాద్ లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు .. !

ఉన్న చోట ఉపాధి లేక బ్రతుకు భారంగా మారితే ఉపాధి కోసం ఇంకోచోటికి వెళ్లడం అనేది పరిపాటే. అయితే అలా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని టార్గెట్ చేసి కొంతమంది నరక కూపంలోకి తోసేస్తున్నారు. బంగ్లాదేశ్ లో పనులు  లేక చాలా పేద కుటుంబాలు అక్రమంగా భారత్ కు వలస వస్తుంటాయి. అయితే ఉపాధి పేరిట కొందరు బంగ్లాదేశ్ యువతులకు డబ్బు ఎరవేసి అక్రమంగా సరిహద్దులు దాటించి వ్యభిచార కుంపటిలోకి దింపుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు.

తీరా ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్లలేక.. కుటుంబ కష్టాలను గుర్తుకు తెచ్చుకుని ఇష్టం లేకున్నా మనసు చంపు కొని నిర్వాహకులు ఎలా చెబితే అలా చేస్తున్నారా ఆ యువతులు. చదువు రాకపోవడం బెంగాలీ తప్ప మరో భాష తెలియకపోవడంతో ఎవరితోనూ తమ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన హైటెక్ సెక్స్ రాకెట్  బంగ్లాదేశ్ యువతుల బాధలకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్ లోని వీరి ఏజెంట్లు తమకు తెలిసిన మురికివాడల్లోని పేదలను సంప్రదించి భారత్ లో బాగా స్థితిమంతుల ఇళ్లు హోటళ్లలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ అమ్మాయిలను పంపాలని కోరతారు. చిన్నపిల్లలైతే ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో 19 నుంచి 25 ఏళ్ల యువతులను ఎంపిక చేసుకుంటారు. పాస్పోర్ట్ వీసాలు లేకుండానే వీరిని అక్రమమార్గాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని వేశ్యా గృహాల్లో ఉంచుతారు.

అబ్దుల్లాపూర్ మెట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ బాటసింగారం సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం రాకెట్ ను పోలీసులు ఛేదించారు. వారి చెరలో మగ్గుతున్న ఇద్దరు యువతులను రక్షించారు. డేటింగ్ యాప్స్ లో  ఈ యువతుల చిత్రాలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. గూగుల్ పే ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తే.. వారి వద్దకు యువతులను పంపడం లేదా విటులనే రప్పించుకోవడం పనిగా పెట్టుకున్నారు.  ఈ రాకెట్ ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన లిటన్ సర్కార్ ది బంగ్లాదేశ్.  అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ కు త్వరలో బదిలీ కానుంది.

Source: https://www.tupaki.com/politicalnews/article/Another-high-tech-sex-rocket-conspiracy-in-Hyderabad/268806

Leave Your Comment