logo

header-ad
header-ad

Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..!

Telugu States Heavy Rains: అక్కడా….ఇక్కడ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, నదులు నిండిపోయాయి. చాలా చోట్ల ఇళ్లు, రోడ్లు చెరువుల్లా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజులుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

జోరుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగు పోస్తోంది. పాకాల వాగు, బయ్యారం అలుగేరు ఉధృతం ప్రవాహించటంతో గార్ల వద్ద రాంపురం చెక్ డ్యాం పై నుండి నీరు ప్రవహించటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆటంకం ఏర్పడింది.

అటు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాల్లో కురిసిన వర్షానికి బోర్లగూడెం గ్రామం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. వర్షం కారణంగా కాటారం నుంచి మహాముత్తారం మండల కేంద్రానికి వచ్చే విద్యుత్ లైన్‌ అంతరాయం ఏర్పడింది. రాత్రి నుండి వదలకుండా పడుతున్న వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100పడకల ఆసుపత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. హాస్పటల్‌కి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో మెయిన్‌ గేట్ దగ్గర వరదనీరు చేరింది.

వరంగల్ రూరల్ జిల్లా గురజాల వద్ద వాగు దాటుతూ అనిల్ అనేవ్యక్తి వాగులో గల్లంతు కాగా.. తాజాగా ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు మేడారం జంపన్నవాగులో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శ్యామల్‌రావు, కోటేశ్వరరావు గుర్తించారు. గల్లంతైన వారికోసం నిన్నటి నుండి నిర్విరామంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఆచూకీ లభించలేదు.. వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, మళ్లీ వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు తడిచిపోవడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరున కురుస్తున్న వర్షాలకు కృత్రిమ జలపాతాలు కూడా ఏర్పడుతున్నాయి. భువనగిరి ఆంజనేయ ఆరణ్య పార్క్‌లో పెద్ద బండ రాళ్ల మీద నుంచి వర్షపు నీరు జలపాతంలా జాలువారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. జలాశయం నిండుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇక, హైదరాబాద్‌ జంట నగరాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నాంపల్లి, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీళ్లను డ్రైనేజ్‌లకు మళ్లించారు రెస్క్యూ సిబ్బంది. ఎల్‌బీనగర్, ఉప్పల్, లింగంపల్లి, చందానగర్, మెహిదీపట్నంలో కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవల్సి వచ్చింది.

మరోవైపు, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖరీఫ్‌ సేధ్యానికి సిద్దమవుతున్న టైమ్‌లో వర్షం కురుస్తుండటంతో రైతులు సాగుపనులు మొదలుపెట్టారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్ట్‌కి మహారాష్ట్ర నుంచి వరదనీరు చేరడంతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు..

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

Source: https://tv9telugu.com/latest-news/heavy-rains-falling-in-telangana-and-andhra-pradesh-500022.html

Leave Your Comment