ఇప్పుడంటే ఇంగ్లిష్ మెడిసిన్లు, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కానీ.. ఒకప్పుడు మన పూర్వీకులు మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే పలు పదార్థాలనే ఔషధాలను తయారు చేసుకుని సేవించేవారు. అయితే ఇప్పుడా పద్ధతి చాలా వరకు కనుమరుగయ్యిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ అప్పుడు వారు తయారు చేసిన పలు ఔషధాలను ఇప్పుడు కూడా మనం తయారు చేసుకుని వాడవచ్చు. వాటిలో ముఖ్యమైన ఔషధం.. త్రికటు చూర్ణం.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాంతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లమిరియాలు, ఎండబెట్టిన అల్లం, పిప్పళ్లను అన్నింటినీ సమాన పరిమాణంలో తీసుకోవాలి. వాటిని నూనె లేదా నెయ్యి లాంటి పదార్థాలు ఏవీ వేయకుండా పెంకుపై వేయించుకోవాలి. పొడిగా అయ్యే వరకు లైట్‌గా వేపుకోవాలి. ఏదైనా తేమ ఉంటే పోతుంది. అనంతరం ఆ మూడు పదార్థాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దాన్ని గాజు సీసా లేదా డబ్బాలో నిల్వ చేసుకుని రోజూ ఉపయోగించాలి. ఈ క్రమంలోనే ఈ త్రికటు చూర్ణంతో మనం ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. త్రికటు చూర్ణాన్ని నిత్యం ఒకసారి తీసుకుంటే చాలు.1 టీస్పూన్ మోతాదులో ఈ చూర్ణం తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. దీంతో జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. ఆస్తమా ఉన్నవారు ఈ చూర్ణం తీసుకుంటే ఎంతో మంచిది. ఊపిరితిత్తుల్లో అధికంగా ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఫలితంగా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి.
2. ఆకలి బాగా ఉన్నవారు, అస్సలు ఆకలి లేని వారు ఈ చూర్ణం తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే మహిళలకు రుతు సమయంలో శరీరంలో ఎక్కువగా చేరే నీరు బయటకు వెళ్లిపోతుంది.
3. త్రికటు చూర్ణం తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. సంతాన సాఫల్యత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
4. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి త్రికటు చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. వారు త్రికటు చూర్ణం, తేనెలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి నిత్యం 3 పూటలా భోజనానికి ముందు తీసుకుంటే వారి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.