logo

header-ad
header-ad

ఉద్యోగులకు శుభవార్త... గ్రాట్యూటీకి కొత్త రూల్ వచ్చేస్తోంది

ఉద్యోగులకు గుడ్ న్యూస్. గ్రాట్యుటీపై కొత్త రూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ రూల్ అమలులోకి వస్తే ఐదేళ్ల లోపు పనిచేసినా గ్రాట్యుటీ పొందొచ్చు. కొత్త రూల్ ఎలా వర్తిస్తుందో తెలుసుకోండి.

1. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక కంపెనీలో లేదా సంస్థలో వరుసగా ఐదేళ్లు పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ ఐదేళ్ల లిమిట్‌ను ఒకటి నుంచి మూడేళ్లకు తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

2. భారతదేశంలో ఉద్యోగులు తక్కువ కాలం పనిచేసి మరో కంపెనీలోకి మారుతుంటారు. దీని వల్ల గ్రాట్యుటీకి అర్హత సాధించలేకపోతున్నారు. సాధారణంగా వరుసగా ఐదేళ్లు పనిచేస్తేనే గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. ఐదేళ్ల పైన పనిచేసిన ఉద్యోగులకు అప్పటివరకు అందించిన సేవల్ని గుర్తిస్తూ కంపెనీలు, సంస్థలు గ్రాట్యుటీని అందిస్తుంటాయి. 

3. ఇటీవల కాలంలో ఉద్యోగ భద్రత తగ్గిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీని వల్ల గ్రాట్యుటీ పేమెంట్స్ కూడా తగ్గిపోయాయి. ఒకవేళ ఉద్యోగులు ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేస్తున్నా ఆ కంపెనీలు గ్రాట్యుటీని తప్పించుకోవడానికి కొంతకాలంపాటు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. లేదా మరో సంస్థ పేరు మీద వారిని నియమించుకుంటున్నాయి. 

4. దీని వల్ల ఉద్యోగులు ఒకే సంస్థలో ఐదేళ్లకు మించి పనిచేస్తున్నట్టు రికార్డుల్లో ఉండట్లేదు. అలాంటి ఉద్యోగులు గ్రాట్యుటీని కోల్పోతున్నారు. ఐదేళ్ల నిబంధన వల్ల ఈ పరిస్థితి వస్తోంది. అందుకే ఈ నిబంధనను రెండుమూడేళ్లకు తగ్గిస్తే ఉద్యోగులు గ్రాట్యుటీ పొందే అవకాశాలు ఎక్కువ.

5. కార్మికుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా గ్రాట్యుటీని ఐదేళ్ల కన్నా తక్కువకు తగ్గించాలని, దీన్ని సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో భాగంగా చేర్చాలని సూచించింది. నిరుద్యోగ బీమా, గ్రాట్యుటీ నిబంధనను ఐదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించడం లాంటి అంశాలను ప్రస్తావించింది.

6. ఈ కమిటీ సోషల్ సెక్యూరిటీ కోడ్ తుది నివేదికను రూపొందించింది. ఇందులో గ్రాట్యుటీతో పాటు ప్రావిడెంట్ ఫండ్, మెటర్నిటీ బెనిఫిట్స్, అసంఘటిత రంగ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ లాంటి తొమ్మిది చట్టాలను మార్చనుంది. రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వీటికి ఆమోద ముద్ర పడే అవకాశముంది.

7. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం, 1972 ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. గ్రాట్యుటీ ఉద్యోగుల వేతనంలో భాగమే. సంస్థ యజమాని ఉద్యోగుల సేవల్ని గుర్తించి ఇచ్చే పారితోషికమే గ్రాట్యుటీ.

8. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో గ్రాట్యుటీ కూడా ఉంటుంది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో లేదా ఉద్యోగం మానేసి వెళ్లిపోయే సమయంలో గ్రాట్యుటీ చెల్లిస్తుంది ఆ సంస్థ. ప్రస్తుతం ఐదేళ్ల పాటు నిరంతరాయంగా ఓ సంస్థలో పనిచేసినవారికే గ్రాట్యుటీ వర్తిస్తుంది.

9. గ్రాట్యుటీ పొందాలంటే కనీసం 4 సంవత్సరాల 10 నెలల 11 రోజులు పనిచేయాలి. అప్పుడే ఐదేళ్ల గ్రాట్యుటీ వస్తుంది. ఒకవేళ 6 సంవత్సరాల 6 నెలలు పనిచేస్తే ఏడేళ్ల గ్రాట్యుటీకి అర్హులు. అదే 6 ఏళ్ల 5 నెలలు పనిచేస్తే ఆరేళ్ల గ్రాట్యుటీ మాత్రమే వస్తుంది.

10. గ్రాట్యుటీ లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంది. సాధారణంగా ఒక నెలలో పనిరోజులు 26 ఉంటాయి. బేసిక్ సాలరీ, డీఏ, కమిషన్ కలిపి గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఒక వేళ ఉద్యోగి చనిపోతే నామినీకి గ్రాట్యుటీ చెల్లిస్తారు. 15 రోజులు x చివరి వేతనం x పనిచేసిన సంవత్సరాలు / 26 అనే ఫార్ములాతో గ్రాట్యుటీని లెక్కిస్తారు. 

11. ఉదాహరణకు ఓ వ్యక్తి వేతనం నెలకు రూ.50,000 అనుకుందాం. అతను ఓ సంస్థలో 15 ఏళ్ల 8 నెలలు పనిచేస్తే 16 ఏళ్ల గ్రాట్యుటీకి అర్హత వచ్చినట్టే. ఈ లెక్కన గ్రాట్యుటీ (15 రోజులు x రూ.50,000 x 16 ఏళ్లు)/26 = రూ.4.61 లక్షలు.

12. గ్రాట్యుటీ వేతనంలో భాగం కాబట్టి జీతం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. అయితే గ్రాట్యుటీకి పన్ను మినహాయింపులు ఉన్నాయి. రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ పొందితే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

 

 

Source: https://telugu.news18.com/photogallery/jobs/good-news-central-government-may-cut-gratuity-eligibility-rule-from-5-years-to-1-year-ss-575844.html

Leave Your Comment