logo

header-ad
header-ad

అంతుచిక్కని అంతరంగం.. గంటా మీ దారెటు ?

ఆయన చిక్కడు దొరకడు. చిరంజీవితో క్లోజ్‌గా ఉంటారు. కానీ ఆయన తమ్ముని పార్టీ అనేసరికి మొహం చాటేస్తారు. సైరా రిలీజ్‌ అంటే సై..సై.. అంటారు. అన్నీ తానై చూస్తారు. కానీ పార్టీ అధినేత ఆదేశిస్తే మాత్రం తన మనస్సాక్షిని వాడుకుని హ్యాండిస్తారు.. సాగర తీరంలో వాస్తు ప్రకారం ఉత్తరం పక్కన వున్న ఆయన…ఇప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

విశాఖలో జనసేన లాంగ్‌ మార్చ్‌ ముగిసింది. కానీ ఆ మార్చ్‌ ప్రకంపనలు టీడీపీని తాకాయి. సాగర తీరాన రాజకీయం అల్పపీడనం సృష్టిస్తోంది. ఈ అల్పపీడనం పొలిటికల్‌ తుఫాన్‌గా మారుతుందా? తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. ఇంత జరుగుతున్నా సదరు నేత మాత్రం మౌనవ్రతానికే పరిమితమయ్యారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు  జనసేన లాంగ్‌ మార్చ్‌కు రాకపోవడానికి కారణాలేంటి? టీడీపీని వీడాలని గంటా డిసైడ్‌ అయ్యారా? టీడీపీ మద్దతిచ్చినా లాంగ్‌ మార్చ్‌కు వెళ్లకుండా అందుకే దూరంగా ఉన్నారా? పవన్‌ కల్యాణ్‌తో వ్యక్తిగత విభేదాలే కారణమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హీట్‌ పెంచుతున్నాయి.

లాంగ్ మార్చ్‌ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ స్వయంగా కాల్ చేసి మద్దతు కోరిన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు మద్దతు ప్రకటించడంతోపాటు తమ పార్టీ తరపున గంటా శ్రీనివాస్ రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరవుతారని కూడా పేర్లతో సహా ప్రకటించారు.

లాంగ్‌ మార్చ్ జరిగిన టైమ్‌లో గంటా విశాఖలోనే ఉన్నారు. వేరే పనులు లేవు. కానీ ఆయన మార్చ్‌కు రాలేదు. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మద్దతు పలికారు.  కానీ అధినేత మాటలను మాత్రం ఆయన పట్టించుకోలేదు. గంటా ఇప్పడు పార్టీ ఆదేశాలను కూడా ఎందుకు పట్టించుకోలేదనేది పెద్ద డిస్కషన్‌ పాయింట్‌ అయింది.

గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో….గంటా పార్టీ మారుతారని ఆరునెలల నుంచి ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఓ సారి ఆయన వైసీపీలో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు.

ఇటీవల సైరా సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ మీటింగ్‌లో గంటా కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు గంటా వెళ్లలేదు. ఆ తర్వాత ఆయన రాంమాధవ్‌తో దిగిన ఫోటో వైరల్‌ అయింది. దీంతో గంటా చూపు బీజేపీపై పడింది అని న్యూస్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు టీడీపీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరుకాకపోవడంతో పార్టీలో ఆయన మీద టీడీపీ నేతల్లో డౌట్లు మొదలయ్యాయి. గంటా పార్టీ మారడం ఖాయమని వారే గుసగుసలు ఆడుకుంటున్నారు. మరీ గంటా దారెటు? ఆయన ఏ కండువా కప్పుకుంటారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Source: https://tv9telugu.com/ganta-met-ram-madhav-157465.html

Leave Your Comment