logo

header-ad
header-ad

రవిప్రకాశ్ అరెస్ట్

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీని కొత్త యజమాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకొన్నట్టు ప్రస్తుత టీవీ9 సీవోవో గొట్టిపాటి సింగరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు శనివారం రవిప్రకాశ్‌ను అరెస్టు చేశారు. గాంధీ దవాఖానలో వైద్యపరీక్షల అనంతరం రవిప్రకాశ్‌ను చిలకలగూడలోని జడ్జి నివాసంలో హాజరుపర్చగా.. 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) గతేడాది ఆగస్టు 27న అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 90.54 శాతం వాటాను కొనుగోలుచేసి ఆ సంస్థను టేకోవర్ చేసింది. అప్పటికే డైరెక్టర్లుగా చెక్‌పవర్‌ను కలిగివున్న రవిప్రకాశ్, మూర్తి కుట్రపూరితంగా వ్యవహరించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వాటాదారుల అనుమతి లేకుండా నిధులను తమ సొంతానికి మళ్లించుకున్నారు. ఈ విధంగా రవిప్రకాశ్ రూ. 6.36 కోట్లు (18-09-2018, 11.03.2019, 08.05.2019 తేదీల్లో), మూర్తి రూ.5,97,87,500(24.10.2018, 10.12.2018, 08.05.2019 తేదీల్లో), మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారియా పేరుతో రూ. 5,97,87,500 చొప్పున మొత్తం రూ.18,31,75,000 దారి మళ్లించారు.

బ్యాంకు లావాదేవీల్లో టీడీఎస్ మినహాయింపుల తరువాత ఈ లెక్క రూ. 11,74,51,808గా ఉన్నది. ఈ ఏడాది జూన్‌లో కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టెర్లు సమావేశమై లెక్కల గూర్చి ఆరాతీయడంతో.. రవిప్రకాశ్, మూర్తి అక్రమాలు బయటపడ్డాయి. బోనస్, ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన డబ్బును విత్‌డ్రా చేస్తున్నట్లు రవిప్రకాశ్, మూర్తి లెక్కల్లో చూపించారు. ఈ వ్యవహారమంతా డైరెక్టర్లు, షేర్‌హోల్డర్ల అనుమతి లేకుండా అక్రమంగా జరిగినట్టు తేలడంతో నిధుల అక్రమ మళ్లింపుపై పూర్తి ఆధారాలను సేకరించిన అలంద సంస్థ.. గత నెల 24న డైరెక్టర్ల సమావేశాన్ని నిర్ణయించి చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. పక్కదారి పట్టిన నిధులు రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18, 2018-19) వచ్చిన లాభాలకు సరిసమానంగా ఉన్నట్టు గుర్తించిన బాధితులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో రవిప్రకాశ్, మూర్తిలపై కేసు నమోదయింది. బాధితులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ కళింగరావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం ప్రధాన నిందితుడైన రవిప్రకాశ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నది. శనివారం సాయంత్రం 7 గంటలకు రవిప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు. కోర్టు అనుమతితో రవిప్రకాశ్‌ను కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారాన్ని సేకరిస్తామని డీసీపీ సుమతి చెప్పారు.

నన్నే స్టేషన్‌కు పిలిపిస్తారా!
శనివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు బంజారాహిల్స్‌లో రవిప్రకాశ్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తీసుకోలేదు. దీంతో స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించడంతో ఆయన తన సొంత వాహనంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో రవిప్రకాశ్‌ను విచారించడంతోపాటు ఆయనపై అభియోగాలకు సంబంధించిన ఆధారాలను చూపించారు. దీంతో రవిప్రకాశ్ పోలీసులపై రెచ్చిపోయినట్టు తెలిసింది. నేను ఎవరిని? నన్నే స్టేషన్‌కు పిలిపిస్తారా? అంటూ ఏకంగా ఏసీపీ గదిలోనే దబాయింపులకు దిగి అహంకారపూరితంగా మాట్లాడినట్టు సమాచారం. అయితే చట్టం ముందు అం దరూ సమానమేనని ఏసీపీ తనదైన శైలిలో చెప్పడంతో రవిప్రకాశ్ తన అహంకారాన్ని తగ్గించుకున్నట్టు తెలిసింది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/former-tv9-ceo-ravi-prakash-arrested-in-rs-18-crore-cheating-case-1-2-614200.html

Leave Your Comment