దోమలు కుట్టడం వల్ల మనకు వచ్చే విష జ్వరాల్లో డెంగీ కూడా ఒకటి. ఇది ఏడిస్ రకానికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. అయితే ఈ దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే మనల్ని కుడతాయి. ఈ దోమలు కుట్టగానే మన శరీరంలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి.
డెంగీ వచ్చిన వారికి విపరీతమైన జ్వరం ఉంటుంది. చలిగా అనిపిస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటాయి. శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వస్తాయి. దాహం విపరీతంగా అవుతుంది. నోరు ఎక్కువగా తడారిపోతుంది. వాంతులు అవుతుంటాయి. కళ్లు నొప్పిగా అనిపిస్తాయి. అయితే డెంగీ వచ్చినప్పటికీ కొందరికి వీటిలో ఒక్కోసారి ఏ ఒక్క లక్షణమూ కనిపించకపోవచ్చు. అలాంటి వారికి వ్యాధి వచ్చాక 2 లేదా 3 రోజుల తరువాత ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.
జ్వరం బాగా వచ్చిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ రోగికి ఉన్న లక్షణాలకు అనుగుణంగా డెంగీ టెస్టు చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే వైద్యులు రోగిని హాస్పిటల్‌లో చేర్చుకుని చికిత్స ప్రారంభిస్తారు. అయితే చికిత్స సమయంలో రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు టైముకు వేసుకోవాలి. ఇక మిగిలిన కుటుంబ సభ్యులు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు లేకుండా చూసుకోవాలి.
డెంగీ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
* వైద్య పరీక్షల్లో డెంగీ ఉందని తేలితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే చికిత్స తీసుకోవాలి. రోగి శరీరాన్ని చల్లని గుడ్డతో తుడుస్తుండాలి. జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి.
* డెంగీ రావడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గుతుందనే విషయం తెలిసిందే. అలాంటప్పుడు వైద్యులు ప్లేట్లను పెంచేందుకు మందులు ఇస్తారు. వాటితోపాటు బొప్పాయి ఆకుల రసాన్ని చాలా స్వల్ప మోతాదులో సేవిస్తుండాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.
* డెంగీ వచ్చిన వారు రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
* తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష, కివీలు, దానిమ్మ, నారింజ పండ్లను బాగా తీసుకుంటే డెంగీ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

Source: https://www.ntnews.com/health/dengue-fever-symptoms-and-safety-tips-1-1-10604045.html