logo

header-ad
header-ad

Deepsikha: ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా.. అమ్మెలాగ మరి’!

దీపశిఖ ఢిల్లీలో బి.ఏ. చదువుతోంది. త్వరలోనే అక్కడినుంచి కేరళ వలస కూలీల పిల్లలకు ఆన్‌ లైన్‌ క్లాసులు తీసుకోబోతోంది. కేరళ ప్రభుత్వం అందుకు ఆమెను ఎంపిక చేసుకుంది. దీపశిఖ కూడా వలస కూలీల కుటుంబంలోని అమ్మాయే. పేదరికం, తాగుడుకు బానిసైన తండ్రి, తండ్రి పెట్టే హింసకు మానసికంగా జబ్బున పడ్డ తల్లి, ఆలనా లాలన లేని ముగ్గురు తమ్ముళ్లు.. ఇంత అభాగ్యమైన పరిస్థితులలో ధైర్యంగా నిలదొక్కుకుంది. కోవిడ్‌ రిలీఫ్‌ వర్కర్‌గా ఇటీవలి వరకు పని చేసింది. ‘ఎవరిదీ అభాగ్యం కాదు. ఎందుకంటే మనకన్నా అభాగ్యులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కనుక..‘ అని అంటోంది ధీశాలి దీపశిఖ.

కొన్నాళ్ల క్రితం వరకు ఏచూరులో ఉన్న దీపశిఖ ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లింది. కేరళ, కన్నూరు జిల్లాలోని ఎదక్కడ్‌ బ్లాక్‌లో ఉంటుంది ఏచూరు గ్రామం. అక్కడి ‘హోలీ మౌంట్‌’ పునరావాస కేంద్రంలో కోవిడ్‌ రిలీఫ్‌ వర్కర్‌గా ఆమె పని చేసింది. ఇప్పుడిక ఢిల్లీ యూనివర్సిటీలో క్లాసులు మొదలవడంతో హోలీ మౌంట్‌ చేయి వదలక తప్పలేదు. బి.ఎ. సంస్కృతం దీపశిఖది. ఆ అమ్మాయికి హిందీ వచ్చు, అస్సామీ వచ్చు. బెంగాలీ వచ్చు. మలయాళం వచ్చు. ఇంగ్లిష్‌ ఎలాగూ వచ్చే ఉంటుంది. ఇన్ని భాషలు వచ్చిన వారు సాధారణంగా వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలోని సమాచార విభాగంలో పని చేస్తుంటారు.

అయితే దీపశిఖను కేరళ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేసుకుంది. తను ఢిల్లీలోనే ఉంటుంది. అక్కడి నుంచి కేరళలోని వలస కార్మికుల పిల్లల కోసం ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతుంది. ‘కేరిటస్‌ ఇండియా’ పర్యవేక్షణలోని ‘కైరోస్‌ కన్నూర్‌’ ప్రాజెక్టు కింద దీపశిఖ కు ఈ బాధ్యతను అప్పగించారు. వలస కూలీలు తమ పిల్లల్ని చదివించడానికి ఎన్ని తిప్పలు పడతారో దీపఖకు తెలుసు కనుక ఆ ‘ఆఫర్‌’ను గొప్ప భాగ్యంగా స్వీకరించింది. దీపశిఖ కూడా వలస కూలీల ఇంటి బిడ్డే. 

పేదరికం ఒక్కటే ఉరుముతుంటే అమ్మ ఒడిలోనో, నాన్న చేతుల్లోనూ తల దాచుకోవచ్చు. దీపశిఖకు, ముగ్గురు తమ్ముళ్లకు నాన్నే ఉరుమయ్యాడు. ఆ ఉరుముకు దంచి అమ్మ మరొక తోబుట్టువు అయిందే తప్ప, అమ్మలా తమను అక్కున చేర్చుకోలేకపోయింది. దీపశిఖ తండ్రి దీపూదేవ్, తల్లి షీలాదేవ్‌ దీపశిఖకు ఆరు నెలల వయసుండగా ఉపాధి వెతుక్కుంటూ అసోం లోని మార్ఘరిటా నుంచి కేరళలోని కన్నూర్‌కు వలస వచ్చారు. తండ్రి తాగి రావడం, తల్లిని కొట్టడం, అన్నం లేదని పళ్లెం విసిరి కొట్టడం.. అప్పుడప్పుడు తమ్ముళ్లనీ కొట్టడం.. దీపశిఖ చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్ననాడనేముందీ.. టెన్త్, ఇంటర్‌ వరకు కూడా!

భర్త కొట్టిన దెబ్బలకు షీల మానసిక ఆరోగ్యం దెబ్బ తినింది! ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా..’ అని ఎన్నోసార్లు తమ్ముళ్లు అన్నా.. ‘అమ్మెలాగ మరి!’ అనే ప్రశ్నే దీపశిఖను నిలిపేసేది. ఆమెను నిలిపింది ఆ ప్రశ్న ఒక్కటే కాదు. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా. అప్పుడే అనుకుంది ఆ అమ్మాయి.. బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకోవాలని. ఇంటర్‌లో మరింతగా కష్టపడి చదివింది. తెల్లవారు జామున మూడు గంటలకు లేచి చదివిందే ఆమె చదువు. రాత్రి తండ్రి చేసే గొడవతో, పగలు కాలేజీకి వెళ్లి రావడంతో చదవడం కుదిరేది కాదు.

దీపశిఖ టెన్త్‌లో ఉండగా ఓ రోజు స్కూలుకు ‘చైల్డ్‌లైన్‌’ అధికారులు వచ్చారు. ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లల్ని అడిగారు. దీపశిఖ తన సమస్య గురించి చెప్పింది. నాన్న తాగి రావడం, అమ్మ ఏడుస్తూ ఉండటం, తమ్ముళ్లు ముగ్గురూ తన చుట్టూ చేరడం.. అన్నీ చెప్పింది. ఆ మర్నాడే ‘కేరిటస్‌ ఇండియా’ వాళ్లు వచ్చి దీపశిఖను, మరికొందరు విద్యార్థినులను తమ ఆధ్వర్యంలోని ‘సాంత్వన భవన్‌’కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల గురించి ఒక్కోటీ తెలుస్తున్నప్పుడు దీపశిఖకు తన కష్టాలు పెద్ద కష్టంగా కనిపించలేదు.

తనకు మించిన అభాగ్యులు కూడా లోకంలో ఉన్నారు అనుకుంది. చేతనైతే వాళ్లకు సహాయం చేయాలని కూడా అప్పుడే నిర్ణయించుకుంది. ఏదో ఒక సహాయం. చదువు సహాయం. సేవల సహాయం. కనీసం మాట సహాయం. ఇప్పుడు ఆమెకు ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడం అనే సహాయం చేసే అవకాశం వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థల్లో చేరాలని దీపశిఖ ఆశ. ఆమె తమ్ముళ్లు తల్లి దగ్గరే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.     

Source: https://www.sakshi.com/telugu-news/family/deepsikha-struggle-childhood-now-working-migrants-kerala-1370179

Leave Your Comment