గత కొన్ని రోజులుగా ఎగువన వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నదులకు వరదలు పోటెత్తింది. ఈ వరద కారణంగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. మరోవారం రోజుల్లో వరద ఉదృతి తగ్గుతుంది. అప్పుడు ఇసుక తవ్వకాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
మరోవారంలో అన్ని సర్దుకుంటాయిలే అనుకుంటున్న సమయంలో బుల్ బుల్ రూపంలో ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తుఫానుగా, నవంబర్ 9వ తేదీ వరకు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వావరణశాఖ తెలియజేసింది. ఈ బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతుంటే.. ఈ బుల్ బుల్ తో మరిన్ని ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయి.