జగదేవ్‌పూర్ (గజ్వేల్): సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి కేసీఆర్ దంపతులు గడప ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామన 5.10 గంటలకు గడపను ప్రతిష్టించారు. కార్తీక మాసం సప్తమి సందర్భంగా మంచిరోజు ఉందని శృంగేరి పండితులు చేసిన సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. శృంగేరీ పీఠం మండితులు ఫణి శశాంకశర‍్మ, గోపికృష్ణశర్మ పర్యవేక్షణలో మరికొంతమంది పండితుల సమక్షంలో గడప ప్రతిష్టతో పాటు గోమాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో గతంలో నిర్మించిన ఇంటిని కూల్చివేసి నైరుతి ప్రాంతంలో కొన్ని నెలల క్రితం నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నట్లు తెలిసింది.

Source: https://www.sakshi.com/news/telangana/cm-kcr-couple-peforms-puja-new-house-erravalli-1237379