ఏపీలో బీజేపీ వైసీపీ నేతల మధ్య సయోధ్య అంతగా లేదు. అధికార పార్టీ ఎడ్డెం అంటే బీజేపీ వాళ్ళు తెడ్డెం అనుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు దిశగా అడుగులు వేయడం లాంటి నిర్ణయాల పట్ల కేంద్రం అసంతృప్తితో ఉంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని, విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఏపీలో ఎలాగైనా ఎదగాలని భావిస్తోన్న బీజేపీ చచ్చిన పాములా టీడీపీని భావించి తమ ఫోకస్ ను వైసీపీ వైపు మళ్లిస్తోంది. నిజానికి మోడీకి ఆప్తులనే పేరున్న గుజరాత్ కి చెందిన ఆదానీ గ్రూప్ చంద్రబాబు హయాంలో రూ.70 వేల కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
తాజాగా ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌కు మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రూ. 15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏపీ నుంచి తరలి వెళ్తోంది. ఈ విషయమై బీజేపీ నేత సహ ఇంఛార్జి అయిన సునీల్ దేవ్‌ధర్ ఘాటుగా స్పందించారు. ‘‘రూ. 70,000 కోట్ల అదానీ డేటా & సోలార్ ప్రాజెక్ట్ పెట్టుబడులు, రూ. 15000 కోట్ల రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు ఆంధ్ర ప్రదేశ్ నుండి తరలిపోతున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం.. జీతాలకు & అప్పుల వడ్డీలకు చాలడం లేదు. నవరత్నాలకు సంపాదించి ఖర్చు పెట్టాలి గానీ అప్పులు చేసి కాదు. మేలుకో జగన్’’ అని సునీల్ దేవ్‌ధర్ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ లెక్కన ఏపీ బీజేపీ జగన్ మీద ఎంత ఫోకస్ పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు.