కార్తికమాసం వచ్చిందంటే అందరి చూపు భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవం పైనే ఉంటుంది.. కొండల మీంచి దివ్వెలు దిగివస్తాయి. దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఇవాళ ప్రారంభమవుతోంది.. ఈ నెల 18వ తేదీవరకు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది భక్తి టీవీ..
ఇక తొలిరోజు కోటిదీపోత్సవంలోని కార్యక్రమాలను ఓసారి పరిశీలిస్తే.. పుష్పగిరి శ్రీ విద్యాశంకర భారతి స్వామిచే అనుగ్రహ భాషణం.. శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఉంటుంది. వేదికపై కాశీస్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన జరగనుండగా.. భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన చేయిస్తారు. ఇక తొలిరోజు కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం కన్నుల పడువగా జరగనుండగా.. హంస వాహన సేవ నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే...