logo

header-ad
header-ad

విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గం:అశ్వత్థామరెడ్డి

కార్మిక సంఘాల ఐక్యత దెబ్బతినదు ...ఎవరూ అధైర్యపడొద్దని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై తాము వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్క డిమాండ్‌నూ వెనక్కు తీసుకోబోమని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పోరాటం అన్యాయమని తేలితే రేపే విధులకు హాజరవుతామని ప్రకటించారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని  కోరారు. ఇందిరా పార్క్‌ వద్ద రేపు చేపట్టే  ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించి కార్మికులకు ధైర్యం చెబుతామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పట్టుపట్టబోమని కోర్టులో కార్మిక సంఘాల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్‌ వదులుకున్నట్లయింది. వారు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ డిమాండ్లను అధ్యయనం చేయండి’’ అని మంగళవారం  ప్రగతిభవన్‌లో జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి  సీఎం ప్రకటనపై స్పందించారు. విలీనం డిమాండ్‌పై తాము వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని ప్రకటించి ప్రజల్లో ఉన్న సందిగ్ధతకు తెరదించారు.

Source: https://www.eenadu.net/newsdetails/16/2019/10/23/119030903/ashwathama-reddy-reacts-on-cm-kcr-decision

Leave Your Comment