logo

header-ad
header-ad

సీఎం సమీక్ష.. ఆ రెండు మినహా అన్ని శాఖల్లో తగ్గిన ఆదాయం..

ఏపీ సర్కారు ఆదాయ వనరులపై  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయాలతో పోలిస్తే వాణిజ్య పన్నులు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మినహా అన్ని శాఖల్లో ఆదాయం తగ్గింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమన ప్రభావం, ఇతరత్రా కారణాలతో ఏపీ సర్కారు ఆదాయం తగ్గింది. వాణిజ్య శాఖలో 0.14 శాతం వృద్ధి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ లో 3.26 శాతం వృద్ధి మినహా మిగతా అన్ని శాఖల్లో ఆదాయం తగ్గినట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్ కి తెలిపారు. 

కొత్త మద్యం పాలసీతో ఎక్సైజ్‌ శాఖలో 8.91 శాతం ఆదాయం తగ్గిందని తేలింది. అలాగే రవాణా, గనులు, భూగర్భ వనరులు, ల్యాండ్ రెవెన్యూ, ఫారెస్ట్  శాఖల్లో ఆదాయం తగ్గినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. రాబడిలో అన్ని శాఖల నుంచి 2.10 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది మొత్తం రూ.35,411 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ. 34,669 కోట్లు మాత్రమే. మొత్తం 741 కోట్లు నష్టం వచ్చిందని తేలింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని సీఎం జగన్ అన్నారు. ఇది సానుకూలమైన అంశమని సీఎం అన్నారు. పెండింగ్‌ పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్యను పెంచితే ఆదాయం వస్తుందని సూచించారు. అత్యంత విలువైన ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయత్నించాలని అటవీ శాఖకు ఆదేశాలిచ్చారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై అన్ని శాఖలు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు.

Source: https://www.ntvtelugu.com/post/ap-cm-ys-jagan-review-on-financial-conditions

Leave Your Comment