logo

header-ad
header-ad

‘పార్టీనీ నడిపించలేకపోతే సినిమాలు చేసుకోండి’

తాడేపల్లి : పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌పై ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్‌ సభలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కడా కనిపించలేదని, జనసేన జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు మాత్రమే కనిపించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అద్భుతంగా పాలన చేస్తున్నారని, కానీ ఆ ఇద్దరు మూర్ఖులకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు. బాబు హయాంలో వలసవెళ్లిన కార్మికుల గురించి పవన్‌ ఎందుకు మట్లాడలేదని అంబటి ప్రశ్నించారు. పవన్‌కు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకునే ఉద్దేశం లేదన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని పవన్‌ను హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. 

‘అక్రమ నివాసంలో ఉండొద్దని బాబుకు చెప్పగలరా. నిన్నటి సభలో టీడీపీ స్క్రిప్టును పవన్‌ చదివి వినిపించారు. వైఎస్‌ జగన్‌ పోరాటాలు చూసే ఆయన్ని ప్రజలు సీఎంను చేశారు. పవన్‌కు ఓటేస్తే టీడీపీకి వెళ్తుందనే ప్రజలు మా పార్టీని గెలిపించారు. కూలిపోయిన టీడీపీ భవనానిన నిర్మించే పనిలో ఆయన ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ కన్ఫ్యూజన్‌, స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఏం పోరాటం చేశారో చెప్పాలి. పార్టీనీ నడిపించలేక పోతే సినిమాలు చేసుకోండి. పవన్‌ ముమ్మాటికీ చంద్రబాబు దత్తపుత్రుడే. బాబు తప్పులు చేసినా ఆయన ప్రశ్నించడం లేదు. టీడీపీ గెలిచిన సీట్లు 23 కాదు, 24 అని తేలిపోయింది. వరదలు తగ్గగానే 10 రోజుల్లో ఇసుక కొరత తీరుస్తాం’ అని అంబటి అన్నారు.

Source: https://www.sakshi.com/news/politics/ambati-rambabu-slams-pawan-kalyan-over-vizag-long-march-1237421

Leave Your Comment